
జైపూర్‌లో యూత్ కాంగ్రెస్ చీఫ్ అమీంద్ర రాజా నేతృత్వంలో కాంగ్రెస్ నిరసన ర్యాలీ
లలిత్ మోదీ వ్యవహారంలో ప్రభుత్వంపై దాడిని విపక్ష పార్టీలు గురువారం మరింత తీవ్రం చేశాయి.
మోదీజీ.. ‘మోదీగేట్’పై స్పందించండి
* లలిత్‌మోదీ వ్యవహారంపై ప్రధానికి కాంగ్రెస్ డిమాండ్
న్యూఢిల్లీ: లలిత్ మోదీ వ్యవహారంలో ప్రభుత్వంపై దాడిని విపక్ష పార్టీలు గురువారం మరింత తీవ్రం చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ధ్యానం’లో నుంచి బయటకు వచ్చి, మౌనం వీడాలని కాంగ్రెస్ వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్ స్కామ్‌స్టర్ లలిత్ మోదీకి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజెలు సహకరించడం తన అనుమతితోనే జరిగిం దా? అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని ప్రధానిని డిమాండ్ చేసింది.
సుష్మా స్వరాజ్, వసుంధర రాజె తక్షణమే రాజీనామా చేయాలని మరోసారి డిమాండ్ చేసింది. ‘కేంద్ర మంత్రులంతా ప్రధాని చేతిలో తంత్రులే. వారేం చేస్తున్నారు? ఏం తింటున్నారు? ఎక్కడికెళ్తున్నారు? ఇలా అన్ని విషయాలు ప్రధానికి తెలుస్తున్నాయి. లలిత్ మోదీకి ట్రావెల్ డాక్యుమెంట్స్ విషయంలో బ్రిటన్ అధికారులతో సుష్మా మాట్లాడిన విషయం కూడా ఆయనకు తెలిసుండాలి. అంటే ప్రధాని అనుమతితోనే ఆమె ఆ పని చేశారా? అలాగే, లలిత్ మోదీకి వసుంధర రాజె సహకరించడం కూడా ప్రధానికి తెలుసా? రాజకీయ విపాసన ధ్యానం నుంచి బయటకు వచ్చి ప్రధాని ఈ ప్రశ్నలకు సమాధానమివ్వాలి.
తన నిర్దోషిత్వం రుజువు చేసుకోవాలి’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి టామ్ వదక్కన్ డిమాండ్ చేశారు. వసుంధర రాజె కుమారుడు దుష్యంత్ సింగ్ కంపెనీలో లలిత్ మోదీ పెట్టుబడులపై విచారణ జరపాలన్నారు. చోటామోదీ(లలిత్)కి సహకరిస్తోంది ఎవరో బయటపడాల్సి ఉందన్నారు. వసుం ధర రాజె లలిత్ మోదీకి సహకరించారన్న విషయం నిర్ధారణ అయిందని, తప్పును సమర్ధించుకోలేని స్థితిలో ప్రస్తుతం ఆమె ఉన్నారని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ వ్యాఖ్యానించారు. ప్రధాని మౌనం అంగీకార సూచకమని బిహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. ప్రధాని నోరు విప్పాలని సీపీఐ ఎంపీ రాజా డిమాండ్ చేశారు. సుష్మా, రాజెలు రాజీనామా చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది.
మోదీ తదుపరి లక్ష్యం ఆరెస్సెస్: దిగ్విజయ్
తానుఎదగడానికిసహకరించిన వారిని, తనతో నడిచిన వారిని అణచివేయాలన్న సిద్ధాంతంలో ప్రధాని మోదీకి సంపూర్ణ విశ్వాసం ఉందని కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ అన్నారు. ‘గతంలో హిరేన్ పాఠక్, అద్వానీజీ, మురళీ మనోహర్ జోషీ.. ఇప్పుడు సుష్మా స్వరాజ్, వసుంధర రాజె. ఆయన(మోదీ) తదుపరి లక్ష్యం అరుణ్ జైట్లీ,రాజ్‌నాథ్ సింగ్‌లే కావచ్చు. జైట్లీ, రాజ్‌నాథ్.. జాగ్రత్తగా ఉండండి’ అంటూ బుధవారం ట్విటర్లో హెచ్చరించారు. ‘మోదీ జాబితాలో ఆరెస్సెస్ ఉన్నా ఆశ్చర్యం లేదు.
ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ వర్ధంతి రోజైన జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా.. ఆ రోజు తన ప్రాముఖ్యత ఎక్కువ ఉండేలా చూసుకున్నారు’ అంటూ దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. మరోవైపు లలిత్ పాల్పడిన నేరాలన్నీ యూపీఏ హయాంలోనే జరిగాయంటూ ప్రభుత్వం విపక్షంపై ఎదురుదాడి ప్రారంభించింది. అప్పుడు లలిత్‌పై యూపీఏ ఏ చర్యలూ తీసుకోలేదని, ఆయనను భారత్‌కు తీసుకువచ్చే ప్రయత్నించలేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ విమర్శించారు.
తప్పేం చేయలేదు: దుష్యంత్ సింగ్
లలిత్ మోదీ నుంచి తన కంపెనీ నియంత్ హెరిటేజ్ హోటల్స్‌కు పెట్టుబడులు రావడంపై వసుంధరరాజె కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్ స్పందించారు. తన కంపెనీ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు. ‘కొ న్ని రోజులుగా మీడియాలో నా వ్యక్తిత్వాన్ని కించపరిచే దుష్ర్పచారం జరుగుతోంది. కంపెనీల చట్టం, ఆదాయపన్ను నిబంధనల ప్రకారమే నా కంపెనీలో లావాదేవీలన్నీ జరిగాయి’ అని గురువారం ప్రకటన జారీ చేశారు. కాగా, సుష్మా స్వరాజ్‌తో గురువారం బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి భేటీ అయ్యారు.