
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య సమష్టి నాయకత్వం అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. ఈ ఏడాది చివరలో అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్టీకి క్లిష్టంగా మారింది. దాంతో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించకుండా ఆయా రాష్ట్రాల్లో పార్టీ విజయాన్ని సమష్టి నాయకత్వానికి అప్పగించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి.
ఈ ఏడాదిలోనే ఎన్నికలు జరుగనున్న జార్ఖండ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో సమష్టి నాయకత్వం వ్యూహాన్ని అప్పుడే అమలు చేస్తున్నారు. చత్తీస్‌గఢ్‌లో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న భూపేష్ బాఘెల్, ప్రతిపక్ష పార్టీ నాయకుడు టీఎస్ సింగ్ దేవ్‌లను అలాగే కొనసాగిస్తూ రామ్ దయాళ్ యూహైక్, శివకుమార్ దయారియాలను అదనపు వర్కింగ్ పార్టీ అధ్యక్షులుగా రాహుల్ గాంధీ నియమించారు. ఇక జార్ఖండ్ విషయంలో ఐదుగురు కో ఆర్డినేటర్లను నియమించారు. ఇక పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించక ముందు నుంచే రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో పార్టీలో నాయకత్వం కోసం పోటీ పెరిగింది. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీని సమష్టిగా ఎదుర్కొంటే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ముందుగా అంతర్గత నాయకత్వ సమస్యను అత్యవసరంగా కాంగ్రెస్ పార్టీ పరిష్కరించుకోవాల్సి ఉంది.
రాజస్థాన్‌లో రాహుల్ గాంధీ నామినీ రాష్ట్ర పార్టీకి నాయకత్వం వహిస్తున్న రాజేష్ పైలట్, మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నాయకుడు అశోక్ గెహ్లాట్‌లు సీఎం అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు. ఇక మధ్యప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, మాజీ మంత్రులు జ్యోతిరాదిత్య, కమల్‌నాథ్‌లు ఉన్నత పదవి కోసం పోటీ పడుతున్నారు. రాస్ట్ర కాంగ్రెస్ శాసన సభాపక్షం నాయకుడు అజయ్ సింగ్, మాజీ పీసీసీ చీఫ్ సురేశ్ పచౌరీలు కూడా రేస్‌లో ఉన్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న అరుణ్ యాదవ్‌ను తొలగించి ఆయన స్థానంలో డైనమిక్‌గా ఉండే నాయకుడిని నియమించాలని పార్టీ అధిష్టానంపై ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ నుంచి ఒత్తిడి వస్తోంది.
ఈ నేపథ్యంలో ఎవరిని నియమించినా పార్టీలో అసమ్మతి రాజకీయాలు రాజుకుంటాయి. అందుకని సమష్టి నాయకత్వానికే బాధ్యతలు అప్పగించి, ఎన్నికల అనంతరం నిర్ణయం తీసుకోవడమే సముచితమని రాహుల్ భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment