ఇక రాష్ట్రాలదే నిర్ణయం! | COVID-19: Centre likely to retain limited role and allow states | Sakshi
Sakshi News home page

ఇక రాష్ట్రాలదే నిర్ణయం!

Published Sat, May 30 2020 4:57 AM | Last Updated on Sat, May 30 2020 4:58 AM

COVID-19: Centre likely to retain limited role and allow states - Sakshi

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ 4.0 ముగిసిన తరువాత కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యల విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకే అధికారం ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. జూన్‌ 1వ తేదీ నుంచి కరోనా కేసులు, విస్తృతిని దృష్టిలో పెట్టుకుని కంటెయిన్‌మెంట్‌ జోన్‌లు, ఇతర ఆంక్షలు, సడలింపుల విషయంలో రాష్ట్రాలే నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు శుక్రవారం తెలిపాయి. అయితే, దాదాపు 80% పాజిటివ్‌ కేసులు ఉన్న 30 మున్సిపల్‌ ప్రాంతాల్లో కఠినంగా ఆంక్షలను అమలు చేయాలని ఆయా రాష్ట్రాలకు సూచించే అవకాశముంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్, ఒడిశాల్లో ఈ 30 మున్సిపల్‌ ఏరియాలు ఉన్నాయి. ముఖ్యంగా కరోనా తీవ్రంగా విస్తరిస్తున్న ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతాల గురించి కేంద్రం ఎక్కువగా ఆందోళన చెందుతోంది. అంతర్జాతీయ విమాన సర్వీసులు, సామూహికంగా ప్రజలు పాల్గొనే కార్యక్రమాలు, సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌ తదితరాలపై నిషేధం కొనసాగే అవకాశముందని సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. అలాగే, బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా మాస్క్‌లను ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆదేశించవచ్చన్నారు.

విద్యాసంస్థలు, మెట్రో ట్రైన్‌ సేవలు, ప్రార్థనాస్థలాల పునఃప్రారంభంపై నిర్ణయం రాష్ట్రాలకే వదిలేసే అవకాశముందన్నారు. లాక్‌డౌన్‌ అమలుపై రాష్ట్రాలతో ప్రతీ 15 రోజులకు ఒకసారి సమీక్ష చేయాలని కేంద్రం భావిస్తోందన్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చ్‌లను పునఃప్రారంభించేందుకు అనుమతించాలని ప్రధాని మోదీకి లేఖ రాశానని ఇటీవలే కర్ణాటక సీఎం యెడియూరప్ప చెప్పిన విషయం గమనార్హం. మార్చి 25 నుంచి పలు దశల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. నాలుగో దశ మే 31తో ముగియనుంది. లాక్‌డౌన్‌ ప్రభావం, మే 31 తరువాత ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రాలు పోషించాల్సిన పాత్రపై ఇప్పటికే కేంద్రం లోతుగా చర్చిస్తోంది.

వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న 30 నగరాల్లో 13 నగరాల మున్సిపల్‌ కమిషనర్లు, కలెక్టర్లతో గురువారం కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా ఆన్‌లైన్‌ భేటీ నిర్వహించి, పరిస్థితిని సమీక్షించారు. ఆ 13 నగరాల్లో హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, థానె, పుణె, కోల్‌కతా, జైపూర్, హౌరా, తిరువళ్లూరు మొదలైనవి ఉన్నాయి. కరోనా, లాక్‌డౌన్‌లకు సంబంధించి భవిష్యత్‌ కార్యాచరణపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకున్నారు. జూన్‌ 1 నుంచి ఏయే రంగాల్లో ఆంక్షలను సడలించాలనే విషయంలో వారి సూచనలు తీసుకున్నారు. చాలామంది ముఖ్యమంత్రులు లాక్‌డౌన్‌ను పరిమిత స్థాయిలో కొనసాగించాలనే అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అమిత్‌ షాతో మాట్లాడిన అనంతరం.. లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడగించే అవకాశమున్నట్లు గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ వ్యాఖ్యానించారు.

పశ్చిమ బెంగాల్‌లో దేవాలయాలు ఓపెన్‌!
దేశవ్యాప్త లాక్‌డౌన్‌ మరో రెండు రోజుల్లో ముగియనుందనగా.. రాష్ట్రంలో పలు ఆంక్షలను సడలిస్తూ పశ్చిమబెంగాల్‌ సీఎం మమత బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు. ప్రార్థనాస్థలాలను జూన్‌ 1వ తేదీ నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. జూన్‌ 8 నుంచి ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు 100% హాజరుతో పని చేస్తాయన్నారు. ప్రార్థనా మందిరాల్లో గుంపులుగా గుమికూడవద్దని, 10 మందికి మించి ఒకేసారి లోపలికి అనుమతించకూడదని స్పష్టం చేశారు. తేయాకు, జౌళి పరిశ్రమలు పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తాయన్నారు. భౌతిక దూరం నిబంధనలను పాటించకుండా, వలసకార్మికులతో కిక్కిరిసిన రైళ్లను పశ్చిమబెంగాల్‌కు పంపడంపై రైల్వే శాఖపై మండిపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement