
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప‍్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ దేశీయ ఫార్మా సంస్థ మైలాన్ కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ నెలలోనే రెమ్‌డెసివిర్‌కు తమ జనరిక్ వెర్షన్ ఔషధాన్ని విడుదల చేయనున్నామని సోమవారం ప్రకటించింది. (రెమ్‌డెసివిర్ : మైలాన్‌కు అనుమతి)
దేశంలో వినియోగానికి ‘డెస్రెం’ పేరుతో ఈ ఔషధాన్ని విడుదల చేయనున్నట్లు మైలాన్ తెలిపింది. గిలియడ్ సైన్సెస్ కుచెందిన యాంటీ వైరల్ డ్రగ్ రెమెడిసివిర్ జనరిక్ వెర్షన్ డ్రగ్‌ను 100 మిల్లీగ్రాముల డోస్‌కు 4,800 రూపాయలు (64.31డాలర్లు) చొప్పున ఈ నెలలోనే విడుదల చేస్తామని ప్రకటించింది. ‘డెస్రెం’ పేరుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభించిందని మైలాన్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. (కరోనా కీలక మందు : అమెరికా అద్భుత డీల్)
కాగా సిప్లా లిమిటెడ్, హెటెరో ల్యాబ్స్ లిమిటెడ్ రెమ్‌డెసివిర్ జనరిక్ వెర్షన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. సిప్లాకు చెందిన సిప్రెమిని 5,000 రూపాయల కన్నా తక్కువ ధరకే అందివ్వనుండగా, హెటెరో కోవిఫోర్ ఔషధం ధరను 5,400 రూపాయలకు నిర్ణయించింది. మరోవైపు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం ప్రపంచంలోని కరోనా ప్రభావానికి గురైన దేశాల్లో మూడవ స్థానంలో ఉన్న ఇండియాలో సోమవారం నాటికి 697,413 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా, మరణించిన వారి సంఖ్య 20వేలకు చేరువలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment