
జీఎస్టీని మోదీ అప్పుడు ఎందుకు వ్యతిరేకించారు?
కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ అర్ధరాత్రి నిర్వహించనున్న జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని సీపీఐ ప్రకటించింది.
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ అర్ధరాత్రి నిర్వహించనున్న జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జీఎస్టీ శ్లాబులు అశాస్త్రీయంగా ఉన్నాయని విమర్శించారు. ప్రజలపై భారం మోపేలా శ్లాబులు ఉండటం సరికాదన్నారు. తగిన సమయం ఇవ్వకుండా ప్రభుత్వం హడావుడిగా జీఎస్టీని అమల్లోకి తెస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ జీఎస్టీని ఎందుకు వ్యతిరేకించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
గోరక్షకులపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని తెలిపారు. గోరక్షణ, మూక దాడుల పేరుతో జరిగే హత్యలను సహించబోమని గురువారం మోదీ అన్నారు. చంపే హక్కు ఎవరికీ లేదని ఆయన వ్యాఖ్యానించారు.