తెలంగాణలో పర్యటించాలని సోనియాకు ఆహ్వానం
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్ శనివారం కలిశారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, ఎన్నికల్లో ఓటమి తదితర అంశాలపై వీరిరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. భేటీ అనంతరం డీఎస్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి రాష్ట్రానికి రావాలని సోనియాగాంధీని ఆహ్వానించినట్లు తెలిపారు.
సోనియా వల్లే తెలంగాణ వచ్చిందన్న భావన ప్రజల్లో బలంగా ఉందని డీఎస్ అన్నారు. అయితే ఎన్నికల్లో గెలుపు ఓటమి సహజమని ఆయన అన్నారు. కాంగ్రెస్ బలోపేతానికి, పార్టీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. పోలవరం ఆర్డినెన్స్పై కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని డీఎస్ విమర్శించారు. దీనివల్ల గిరిజనులకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన చెందారు.