
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరో మారణహోమానికి అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కుట్రపన్నాడా? ముంబైలో దాడులు చేసి.. అల్లకల్లోలం రేపాలని డీ గ్యాంగ్ స్కెచ్ వేసిందా? అంటే ముంబై పోలీసులు ఔననే అంటున్నారు. ముంబైలో మరో మారణహోమానికి దావూద్ గ్యాంగ్ కుట్ర పన్నిందని, అన అనుచరుడు అనీస్ ఇబ్రహీం ద్వారా దాడులు చేయాలని పథకం రచించిందని పోలీసులు చెప్తున్నారు. దావూద్, అనీస్ ఇబ్రహీం మధ్య ఫోన్ కాల్స్‌ను ట్యాప్ చేయడం ద్వారా ఈ కుట్ర వెలుగులోకి వచ్చింది.
దావూద్ కుట్ర గురించి తెలియడంతో అప్రమత్తమైన ముంబై పోలీసులు.. ఈ వ్యవహారంపై ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు. దాదాపు 8మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతంలో పాకిస్థాన్‌లో నివసిస్తున్న కరుడుగట్టిన నేరస్తుడు, ఉగ్రవాది అయిన దావూద్ భారత్‌లో విధ్వంసానికి ఎప్పటికప్పుడు కుట్ర పన్నుతున్న సంగతి తెలిసిందే. ముంబై వరుస పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న దావూద్‌ను భారత్‌కు అప్పగించాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కోరుతున్నా.. దావూద్ తమ వద్ద లేడని పాక్ బుకాయిస్తున్న సంగతి తెలిసిందే.