న్యూఢిల్లీ: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డులు, ఇతర సేవలకు ఆధార్ అనుసంధానం చేసే గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించనున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. గతంలో ఆధార్ లేనివారికే అనుసంధాన గడువును మార్చి 31 వరకు పొడిగిస్తామని కోర్టుకి చెప్పిన కేంద్రం ఇప్పుడు అందరికీ గడువును మార్చి 31 వరకు పొడిగించినట్లు తెలిపింది. ఆధార్‌తో మొబైల్ నంబర్ల అనుసంధానానికి ఫిబ్రవరి 6వ తేదీతో గడువు ముగియనుందని పేర్కొంది.
ఆధార్ పథకాన్ని వ్యతిరేకించడంతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న ఆధార్ నమోదు కార్యక్రమంపై స్టే విధించాలంటూ సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఖాన్‌విల్కర్, జస్టిస్ చంద్రచూడ్ బెంచ్ వాదనలు జరిపింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదనలు విన్పిస్తూ.. కొన్ని ఏళ్లుగా అమలవుతున్న ఆధార్ పథకంపై ఎటువంటి స్టే విధించరాదని, డిసెంబర్ 31తో ముగుస్తున్న ఆధార్ అనుసంధానం గడువును కేంద్రం పొడిగించనున్నట్లు కోర్టుకి తెలిపారు.
పెళ్లయితే మతం మారదు
అన్య మతస్తుడిని పెళ్లాడితే మహిళ మతం మారిపోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పార్శి మహిళ వేరే మతస్తుడిని వివాహమాడితే ఆమె మత గుర్తింపు మారుతుందా? అన్న కేసును సుప్రీంకోర్టు గురువారం విచారించింది. ‘ ఇతర మతస్తుడిని పెళ్లి చేసుకున్న తరువాత సదరు మహిళ తన పుట్టింటి మతాన్ని కోల్పోతుందని చెప్పే చట్టాలేం లేవు. పైగా ప్రత్యేక వివాహాల చట్టం ప్రకారం...ఇద్దరు దంపతులు తమ సొంత మతాలనే ఆచరించొచ్చు’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది.
లాయర్ల ‘అల్లరి’పై సీరియస్
ఇటీవల జరిగిన కొన్ని ప్రముఖ కేసుల విచారణ సందర్భంగా సీనియర్ లాయర్లు గట్టిగా అరవడం, వాగ్వాదానికి దిగి జడ్జీలను బెదిరించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు హాల్లో అరుపులు, కేకలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమంది. బాబ్రీ మసీదు , ఢిల్లీ ప్రభుత్వం–కేంద్రం వివాదాల విచారణ సమయంలో సీనియర్ లాయర్ల మితిమీరిన ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అయోధ్య కేసు విచారణను 2019 జూలై వరకు వాయిదా వేయాలని కోరుతూ సీనియర్ లాయర్లు కపిల్ సిబల్ తదితరులు మొండి పట్టుదలకు పోవడం తెలిసిందే. ‘లాయర్లను న్యాయ పరిరక్షకులుగా భావిస్తారు. కొందరు లాయర్లు తాము గళమెత్తి న్యాయ వ్యవస్థతోనే వాగ్వాదానికి దిగగలమని అనుకుంటున్నారు. గట్టిగా అరవడం వారి అసమర్థత, అపరిపక్వతనే సూచిస్తుంది’ అని బెంచ్ పేర్కొంది.
విడిగా ఉన్న భార్యకూ భరణం
విడాకులు తీసుకున్న భార్య తరహాలోనే చట్టబద్ధంగా విడిగా ఉంటున్న భార్యకు ఆమె భర్త భరణం చెల్లించాల్సిందేనని సుప్రీం ఆదేశించింది. విడిగా ఉంటున్న భార్యకు భరణం చెల్లించాల్సిన అవసరం లేదని పట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్ సుప్రీంను ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు బెంచ్ ఈ తీర్పునిచ్చింది. నెలకు రూ.4 వేలు భరణం చెల్లింపును నిరాకరించడానికి హైకోర్టు చూపిన కారణాలు సహేతుకంగా లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తీర్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హైకోర్టుకు సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment