మంత్రిగారికి రాజకీయ వైరాగ్యం!
ఆయన ఐఐటీ బాంబేలో చదివిన ఉన్నత విద్యావంతుడు. ముఖ్యమంత్రిగా పనిచేసి, తర్వాత కేంద్రంలో కీలకమైన రక్షణ శాఖ చేపట్టారు. ఆ పదవి చేపట్టి సరిగ్గా ఏడాది అయ్యిందో లేదో.. అప్పుడే రాజకీయ వైరాగ్యం ప్రకటిస్తున్నారు. ఒక్కసారి పదవి వచ్చిందంటే.. 'జుట్టు పట్టుకుని బయటకీడ్చినా చూరు పట్టుకుని వేలాడి.." అన్నట్లు కుర్చీకి అతుక్కుపోయి ఉండే నాయకులున్న ఈ రోజుల్లో తనకు 60 ఏళ్లు నిండగానే రిటైర్ అవుదామని అనుకుంటున్నట్లు చెప్పారు. ఆయనే గోవా మాజీ సీఎం, ప్రస్తుత రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్. పనజిలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ డిసెంబర్ 13తో తనకు 60 ఏళ్లు నిండుతాయని, దాంతో రెండు మూడేళ్ల క్రితం నుంచే తాను రిటైర్మెంట్ గురించి ఆలోచించడం మొదలుపెట్టానని చెప్పారు. 2012లో గోవా ముఖ్యమంత్రి అయిన పారిక్కర్‌ను 2014 నవంబర్ నెలలో మోదీ సర్కారులో రక్షణ మంత్రిగా తీసుకున్న విషయం తెలిసిందే.
గోవా లాంటి చిన్న రాష్ట్రంలో నాయకత్వ లక్షణాలున్న వాళ్లను వెతికి పట్టుకోవడం చాలా కస్టం అయిపోతోందని పారిక్కర్ వ్యాఖ్యానించారు. తాను ఎక్కడున్నా, తన దృష్టి మాత్రం ఎప్పుడూ గోవామీదే ఉంటుందని, గోవా ప్రభుత్వం తప్పుదారి పడితే, దాన్ని మళ్లీ సరైన దారిలోకి తెస్తానని అన్నారు. ఈ విషయంపై గోవా వాసులకు గ్యారంటీ కూడా ఇస్తానని నొక్కిచెప్పారు.