
సునందా పుష్కర్ హత్య కేసులో శశిథరూర్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు
సాక్షి, న్యూఢిల్లీ : సునంద పుష్కర్ హత్య కేసులో మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత శశి థరూర్‌కు ఢిల్లీ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. కేసులో నిందితుడైన శశి థరూర్‌ను జులై 7న విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో నేరానికి పాల్పడినట్టు థరూర్‌కు వ్యతిరేకంగా స్పష్టమైన అనుమానాలున్నాయని సమన్లు జారీ చేస్తూ కోర్టు అభిప్రాయపడింది. కేసులో నిందితుడిగా ఆయనకు సమన్లు జారీ చేయాలా అనే అంశంపై కోర్టు తన ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచిన వారం రోజుల తర్వాత తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. తన భార్య సునందా పుష్కర్‌కు తీవ్రంగా వేధించి ఆత్మహత్యకు పురిగొల్పేలా శశి ధరూర్ వ్యవహరించారనే ఆరోపణలను కూలంకషంగా పరిశీలించిన మీదట అదనపు చీఫ్ మెట్రపాలిటన్ మేజిస్ర్టేట్ సమర్ విశాల్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
సునంద పుష్కర్ ఆత్మహత్య కేసులో నిందితుడిగా శశి థరూర్‌పై తగినన్ని ఆధారాలున్నాయని, ఆయనను విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేయాల్సిందిగా మే 14న ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు. భార్య సునంద పుష్కర్ పట్ల ఆయన క్రూరంగా వ్యవహరించేవారని, నాలుగున్నరేళ్ల కిందటి ఈ కేసులో ఆయన ఒక్కరే నిందితుడని 3000 పేజీల చార్జిషీట్‌లో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.
ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్‌లో 2014, జనవరి 17న సునందా పుష్కర్ విగతజీవిగా పడిఉన్న విషయం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. శశిథరూర్‌పై భార్యను తీవ్రంగా వేధించడం, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి అభియోగాలపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో శశిథరూర్ ఇంట్లో పనిచేసే నారాయణ్ సింగ్‌ను కీలక సాక్షుల్లో ఒకరిగా పరిగణిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment