
అధికారులు సమర్పించిన నివేదికను పరిశీలించిన న్యాయస్థానం ఈ విషయంలో జరుగుతున్న జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ సమస్య వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై సమాధానం చెప్పాలని ఢిల్లీ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా, ఢిల్లీలో 77 రద్దీగా ఉండే ప్రాంతాలను గుర్తించామని, ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై 55 సార్లు సమావేశాలు నిర్వహించినట్టు ఢిల్లీ పోలీసులు సుప్రీం కోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన నివేదికను సోమవారం కోర్టుకు అందజేశారు.
అధికారులు సమర్పించిన నివేదికను పరిశీలించిన న్యాయస్థానం ఈ విషయంలో జరుగుతున్న జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తరచు గడువు కొరుతూ ఉంటారని.. తేదీలు మారుతున్నా కానీ సమస్య మాత్రం అలానే ఉందని అధికారుల తీరును తప్పుబట్టింది. 54 సమావేశాల నిర్వహించిన తర్వాత కూడా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని పేర్కొంది. దీనిపై ఢిల్లీ పోలీసులు స్పందిస్తూ.. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తొలుత 8 పనులను తక్షణమే పూర్తిచేయాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. అందులో ఇప్పటికే మూడింటిని పూర్తి చేశామన్నారు. పలు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం కూడా ట్రాఫిక్ సమస్యకు ఒక కారణంగా తెలుస్తోంది.