న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీపీఎం బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యవహారంలో న్యాయపోరాటం మొదలుపెట్టిన తొలి రాజకీయ పార్టీ ఇదే కావడం విశేషం. పరిస్థితులు అల్లర్లకు దారితీసేవిగా ఉన్నాయన్న నవంబర్ 18 నాటి సుప్రీం వ్యాఖ్యలు పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వేసిన ఈ పిటిషన్‌లో ప్రతిబింబించాయి.
గత మూడేళ్లలో పలు ప్రభుత్వ బ్యాంకులు సుమారు రూ.1.41 లక్షల కోట్లను మాఫీ చేశాయని ఇందులో ఆరోపించారు. ‘అదే సమయంలో లక్షల కోట్ల రుణాలు వసూలు కాలేదు. రుణ మాఫీ లబ్ధిదారులు, ఎగవేతదారుల వివరాలను ప్రభుత్వం వెల్లడించలేదు. పెద్దనోట్ల రద్దు గందరగోళాన్ని సృష్టించింది. ప్రజల దైనందిన అవసరాల కోసం సరిపడా నగదు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దేశం దాదాపుగా స్తంభించినట్లయింది’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.
డిసెంబర్ 30 లేదా తగినంత నగదు అందుబాటులోకి వచ్చేదాకా ప్రజలు పాత నోట్లను వాడుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని కోరారు. ప్రభుత్వ లక్ష్యం నల్లధనమే అయితే పన్ను వ్యవస్థలను పటిష్టం చేయాలని పేర్కొన్నారు.
నోట్ల రద్దుపై సుప్రీంకోర్టుకు సీపీఎం
Published Thu, Nov 24 2016 8:20 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement