
అన్నింటికీ ఆధారే ఆధారం
ఇప్పటిదాకా గ్యాస్ సబ్సిడీ వంటివాటికే పరిమితమైన మీ ఆధార్ నంబర్ ఇకపై డెబిట్, క్రెడిట్ కార్డు లావాదేవీలకు కూడా కీలకంగా మారనుంది.
- కేంద్ర ప్రభుత్వం కసరత్తు
- డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకే..
- మొబైల్ ఫోన్లలో ఐరిస్ తయారీదార్లతో చర్చలు
ముంబై: ఇప్పటిదాకా గ్యాస్ సబ్సిడీ వంటివాటికే పరిమితమైన మీ ఆధార్ నంబర్ ఇకపై డెబిట్, క్రెడిట్ కార్డు లావాదేవీలకు కూడా కీలకంగా మారనుంది. డిజిటల్ ఆర్థిక లావాదేవీలను మరింతగా ప్రాచుర్యంలోకి తేవడంలో భాగంగా ఈ దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ’‘ఆధార్ ఆధారిత లావాదేవీలకు కార్డు, పిన్ నంబరు అక్కర్లేదు. దీంతో మొబైల్ ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారు తమ ఆధార్ నంబరు, వేలిముద్ర లేదా ఐరిస్ ఆథెంటికేషన్‌తో ఆర్థిక లావాదేవీలను డిజిటల్ రూపంలోనే నిర్వహించుకోవచ్చు’’ అని విశిష్ట గుర్తింపు కార్డుల ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) డెరైక్టర్ జనరల్ అజయ్ పాండే పేర్కొన్నారు. అయితే కార్డు లావాదేవీలను ఆధార్ ఆధారితంగా మార్చేందుకు బహుముఖ వ్యూహాన్ని అనుసరించాల్సి రానుంది.
మొబైల్ తయారీ సంస్థలు, వ్యాపార సంస్థలు, బ్యాంకుల వంటి అన్ని వర్గాల సమన్వయంతోనే ఇది సాధ్యం కానుంది. దాంతో ఆయా వర్గాలతో కేంద్రం చర్చలు జరుపుతోంది. ఆధార్ ఆధారిత లావాదేవీలను సులభతరం చేసేలా దేశీయంగా తయారయ్యే మొబైల్ ఫోన్లలో అంతర్గతంగా ఐరిస్ లేదా వేలి ముద్ర గుర్తింపు మెకానిజాన్ని పొందుపరిచే అవకాశాల గురించి ఫోన్ల తయారీ సంస్థలతో చర్చిస్తున్నట్లు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ వెల్లడించారు.
వ్యాపారులకు ప్రోత్సాహకాలు..
పెద్ద నోట్ల రద్దు అనంతరం డిసెంబర్ 30 దాకా డిజిటల్ లావాదేవీలపై అదనపు చార్జీలు ఉండవంటూ ప్రకటించిన ప్రభుత్వం, ఆలోగా తగు విధానాన్ని ప్రవేశపెట్టడంపై దృష్టి సారించింది. నగదు లావాదేవీలను ఖరీదైన వ్యవహారంగా మార్చడం ద్వారా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించనుంది. ఇందులో భాగంగా వ్యాపారస్తులకు ప్రోత్సాహకాల వ్యవస్థను రూపొందిస్తోంది. దీనికి ఐటీ శాఖ దాదాపు రూ.100 కోట్లు కేటాయించింది. దేశవ్యాప్తంగా ఉన్న రెండు లక్షలకు పైగా కామన్ సర్వీస్ సెంటర్లలో పేరు నమోదు చేయించుకున్న ప్రతి వ్యాపారికీ రూ.100 ప్రోత్సాహకం ఇస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డిజిటల్ చెల్లింపులను మరింత ప్రాచుర్యంలోకి తెచ్చే దిశగా భారీగా ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు వివరించాయి.