సాక్షి, న్యూఢిల్లీ: ‘హాయ్ నేనొక చైనా విద్యార్థిని. నా స్టడీలో భాగంగా ఇండో-చైనా సరిహద్దులపై ఒక వ్యాసం తయారు చేయాల్సివుంది. మీకు ఇబ్బంది లేదనుకుంటే.. వారి దైనందిన జీవితానికి సంబంధించి కొంత సమాచారం ఇస్తారా? నా నుంచి మీకేదైనా సహాయం అవసరమైతే చెప్పండి. తప్పక చేస్తాను’. ఇలాంటి మాటలతో భారత జవాన్లతో దాయాది దేశం పాకిస్తాన్, పొరుగునున్న చైనా దేశాల గూఢచర్యం ముఠాలు స్నేహం చేస్తున్నాయి. గత రెండు, మూడేళ్లుగా సోషల్ మీడియా కేంద్రంగా ఇలాంటి ధోరణి పెరిగిపోయిందనీ.. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే మాదిరిగా సోషల్ మీడియా మారే ప్రమాదముందని భారతీయ పారామిలటరీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రీసర్చ్ స్కాలర్స్‌గా, టూరిస్టులుగా..
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే భద్రతా సిబ్బందితో రీసర్చ్ స్కాలర్స్‌గా, టూరిస్టులుగా తమను తాము పరిచయం చేసుకుని స్నేహం పేరుతో చనువుగా ఉండి దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని తస్కరించాలని చైనా, పాకిస్తాన్ గూఢచారులు యత్నిస్తున్నారని సోషల్‌మీడియా పర్యవేక్షణాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా బీఎస్‌ఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సీఆర్‌పీఎఫ్ భద్రతా దళాలపై ఈ విధమైన ఎత్తుగడలు సాగుతున్నాయని అధికారులు తెలిపారు.
యూనిఫాంతో ఫోటోలు, వీడియోలు వద్దు..
ఉద్యోగ విషయాలు, వ్యక్తిగత సమాచారం సోషల్ మీడియాలో ఇతరులతో పంచుకోకపోవడమే ఉత్తమమని అధికారులు అంటున్నారు. యూనిఫాం ధరించి ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని భద్రతా సిబ్బందికి నిపుణులు సూచిస్తున్నారు. కొత్త వ్యక్తుల నుంచి వచ్చే పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఫేస్‌బుక్, ట్వీటర్, వీకాంటాక్ట్, క్యూజోన్, ఓడ్నోక్లాసినికి, లింక్డ్‌ఇన్, గూగుల్ ప్లస్ వంటి సోషల్ వేదికల పట్ల జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు.
విదేశీ మహిళతో స్నేహం చేస్తూ..
సోషల్ మీడియాలో ఒక విదేశీ మహిళతో స్నేహం చేస్తూ.. దేశ భద్రతకు చెందిన సున్నితమైన సమాచారాన్ని తస్కరించే యత్నం చేశాడనే ఆరోపణలపై ఈ ఏడాది ప్రారంభంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే పటిష్టమైన సాంకేతిక వ్యవస్థ ఏర్పాటు వల్ల మళ్లీ అలాంటి ఉదంతాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
సైనికుల కదలికలపై దృష్టి..
‘ఇప్పటి వరకు మా పర్యవేక్షణా, నిఘాల్లో తేలింది ఏంటంటే.. మన దేశానికి చెందిన సున్నితమైన, ఆందోళనకరమైన ప్రదేశాల్లో ఎంతమంది సైనికులు పనిచేస్తున్నారు. ప్రధానంగా వారి కదలికలు ఏ వైపుగా సాగుతున్నాయి. భద్రతా బలగాలు ఉపయోగిస్తున్న ఆయుధ సామాగ్రి విశేషాలను తస్కరించే యత్నాలు సోషల్ వేదికల ద్వారా జరుగుతున్నాయ’ని సైబర్ పాలసీ అడ్వయిజర్ సుబీమల్ భట్టాచార్ జీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment