
‘ఆప్’ కే దిల్ మే!
నిరాడంబరంగా, హుందాగా సాగిన ఆప్ ప్రచారం
విమర్శలకు దూరం; రెచ్చగొట్టినా సంయమనం ఏం చేస్తామో చెప్పేందుకే ప్రాధాన్యం
పక్కాగా ప్రచారం; ప్రతీ ఓటరుకూ చేరిన సందేశం ఆప్ ఘన విజయం వెనక కారణాలివే!
నేషనల్ డెస్క్: ఢిల్లీ ఫలితాలు అందర్నీ ఆశ్చర్య పరిచాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించడం ఒక ఆశ్చర్యమైతే.. కనీసం 30 అయినా వస్తాయనుకున్న బీజేపీకి ముచ్చటగా మూడంటే మూడే సీట్లు రావడం మరో ఆశ్చర్యం. అయితే, ఈ ఫలితాల వెనక ఒకవైపు ఆప్ పకడ్బందీ వ్యూహం, నిరాడంబర ప్రచార తీరు, నిజాయితీతో కూడిన హామీలు ఉండగా.. మరోవైపు, బీజేపీ ప్రచారార్భాటం, కేజ్రీవాల్‌పై మోదీ వ్యక్తిగత విమర్శలు, సీఎం అభ్యర్థిగా బేడీ ఎంపిక మొదలైనవి ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని అన్ని(7) స్థానాలు గెలుచుకున్న బీజేపీ కేవలం 8 నెలలు తిరగకుండానే ఇంత దారుణంగా పరాజయం పాలవ్వడానికి.. ఆర్థికంగానూ, హంగూఆర్భాటాల్లోనూ బీజేపీకి ఏమాత్రం సరితూగని ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్య, అద్భుత విజయం సాధించడానికి ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీలు అనుసరించిన ప్రచార తీరు, అది చూపిన ప్రభావం ప్రధాన కారణం. దానిపై విశ్లేషణ..
నిజాయితీ.. నిరాడంబరత
‘పాంచ్ సాల్.. కేజ్రీ వాల్’ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన నినాదాల్లో ఒకటి. ఐదేళ్ల పాటు కేజ్రీవాల్‌కు అధికారమివ్వాలని అభ్యర్థిస్తూ ఆప్ సాగించిన ఆ ప్రచారం సరైన దిశగానే సాగినట్లు ఈ ఫలితాలతో తేలింది.
► ఆమ్ ఆద్మీ పార్టీ మొదట్నుంచీ సామాన్యుడిని ప్రతీకగా చేసుకుంది. నీతి, నిజాయితీలను ఆలంబనగా చేసుకుంది. హంగూ ఆర్భాటాలకు, ఆడంబరాలకు దూరంగా ఉంది. ఈ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ అదే మార్గంలో వెళ్లింది.
► క్షేత్రస్థాయి ప్రచారం పైననే ఎక్కువ దృష్టి పెట్టింది. ఎన్నికల ప్రకటన వెలువడటానికన్నా ముందు నుంచే ప్రజలకు దగ్గరగా ఉంది. బూత్ స్థాయిలో ఇన్‌చార్జ్‌లను నియమించింది.
► భారీ బహిరంగ సభలు, రోడ్‌షోలపై కన్నా.. చిన్నతరహా జన సభలపై ఎక్కువ దృష్టి పెట్టింది. కాలనీలు, బస్తీల్లో జన సభలు నిర్వహించి, స్థానిక ప్రజలతో వ్యక్తిగత సాన్నిహిత్యం పెంచుకుంది. అలాంటివి వందకు పైగా నిర్వహించింది. దాదాపు అన్నింటిలో కేజ్రీవాల్ పాల్గొనేలా ప్రణాళికలు రచించింది.
► పేద, మధ్యతరగతి, యువతరం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ.. వారికి దగ్గరయింది. బీజేపీ, కాంగ్రెస్‌ల ప్రత్యామ్నాయంగా, సరికొత్త రాజకీయ శక్తిగా వారికి విశ్వాసం కలిగించింది.
► స్వచ్ఛంద కార్యకర్తల(వాలంటీర్లు) సంఖ్యను భారీగా పెంచుకుంది. 2013 ఎన్నికల నాటికి దాదాపు 25 వేలున్న ఆప్ వాలంటీర్లు ఈ ఎన్నికల నాటికి రెట్టింపయ్యారు. వారి సేవలను ఈ ఎన్నికల్లో విరివిగా ఉపయోగించుకుంది. ఢిల్లీ వెలుపలినుంచి కూడా వాలంటీర్లు వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు.
► భారీ ప్రకటనలు, హోర్డింగ్‌లతో కూడిన ప్రచారం కన్నా.. వార్తాచానళ్లలో చర్చలు, రేడియోల్లో చిన్నచిన్న ఆకర్షణీయ ప్రకటనలపై ఎక్కువ దృష్టి పెట్టింది.
► ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకుంది. అందుకు 24 గంటల పాటు పనిచేసే నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది.
► కేజ్రీవాల్ సహా కీలక నేతలకున్న ఆంగ్లంపై పట్టు, వారి వివరణాత్మక సంవాద తీరు.. ప్రత్యర్థులను తిట్టిపోయడం కాకుండా, సంయమనంతో వ్యవహరించిన విధానం.. తామేం చేయాలనుకుంటున్నామో, ఏం చేయగలమో చర్చల సందర్భంగా, ప్రచార ప్రసంగాల్లో స్పష్టంగా వివరించడం.. ఇవన్నీ చదువుకున్న పట్టణ ప్రజలను, యువతను బాగా ఆకర్షించింది.
► ఆర్థికంగా అంత పట్టులేని ఆప్.. తమకందిన నిధుల వినియోగంలో మంచి చాతుర్యాన్ని చూపింది. భారీగా ఖర్చయ్యే బహిరంగ సభలు, భారీ ప్రకటనలు, హోర్డింగ్‌లకు దూరంగా ఉంది. తక్కువ ఖర్చుతో ఎక్కువమంది ప్రజలకు దగ్గరయ్యే మార్గాలను ఎంచుకుంది. పై పాయింట్లలో పేర్కొన్న పద్ధతులన్నీ దాదాపు తక్కువ ఖర్చయ్యేవే.
► కార్పొరేట్ల నుంచి నిధులు అంతగా రాకపోవడంతో.. కమ్యూనిటీ ఫండింగ్‌పై దృష్టి పెట్టింది. కేజ్రీవాల్‌తో విందుకు హాజరవాలని అనుకుంటున్నవారినుంచి రుసుమును వసూలు చేసి వినూత్నంగా నిధుల సేకరణ జరిపింది.
► {పచారంలో ప్రత్యర్థులపై ఆరోపణలు, విమర్శలకు దూరంగా ఉంది. ఏ సందర్భంలోనూ కఠిన పదజాలాన్ని ఉపయోగించలేదు. దుందుడుకుతనం చూపలేదు. ప్రత్యర్థుల తిట్లనూ పట్టించుకోలేదు. ఇది హుందాతనాన్ని కోరుకునే పట్టణ ఓటర్లను గణనీయంగా ఆకర్షించింది.
► గతంలో అధికారం అప్పగించినప్పటికీ.. 49 రోజులకే రాజీనామా చేయడంపై ప్రజల్లో ఆగ్రహం ఉందన్న విషయాన్ని గుర్తించిన ఆప్.. ఆ దిశగా నష్ట నివారణ చర్యలు చేపట్టింది. రాజీనామా చేయడం పొరపాటేనంటూ కేజ్రీవాల్ పదేపదే చెప్పడంతో ఆయన నిజాయితీపరుడని ప్రజలు భావించారు. దాదాపు తాను పాల్గొన్న ప్రతీ సభలోనూ కేజ్రీవాల్ తన పొరపాటును ఒప్పుకోవడం విశేషం.
► సీఎంగా ఉన్న 49 రోజుల్లో కేజ్రీవాల్ చేసిన మంచి పనులు ప్రజలు గుర్తుంచుకున్నారు. ఉచిత తాగునీరు, విద్యుత్ చార్జీల తగ్గింపు, అవినీతి నిరోధానికి చర్యలు.. మొదలైనవి కేజ్రీవాల్‌కు ప్రజలను దగ్గర చేశాయి.
► ఆప్ ఈ ఎన్నికలకు పెట్టిన మొత్తం ఖర్చు దాదాపు రూ. 20 కోట్లు కాగా.. బీజేపీ కేవలం పత్రికల్లో ప్రకటనలకే అంత మొత్తాన్ని వెచ్చించింది.