ఈవీఎంలపై ఈసీ అసలు విషయం చెప్పింది
న్యూఢిల్లీ: ఈవీఎంల విషయంపై ఎన్నికల కమిషన్ తేల్చేసింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈవీఎంలలో మదర్ బోర్డును మార్చడమంటే మొత్తం ఈవీఎంను మార్చి దాని స్థానంలో కొత్త ఈవీఎంను పెట్టడమేనని చెప్పింది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన డిమాండ్‌ను తిరస్కరిస్తున్నామని తెలిపింది. ఈ మేరకు గురువారం ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన చాలెంజ్‌కు ప్రతిస్పందనగా ఈసీ ఆ పార్టీకి లేఖను రాసింది.
‘అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత ఎన్నికల కమిషన్‌గా మేం చెప్తున్నదేమంటే.. మదర్‌బోర్డులోగానీ, లేదా ఈవీఎంలోని ఇంటర్నల్ సర్య్కూట్‌ను ఎవరైనా మార్చడమంటే దాని అర్థం దాని స్థానంలో మరో కొత్త ఈవీఎంను తీసుకొచ్చి పెట్టడమే. లేదా భారత ఎన్నికల వ్యవస్థలోకి మరోకొత్త ఈవీఎంను తీసుకొచ్చి పెట్టడమే.. ఎందుకంటే ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది అసాధ్యం’ అని పేర్కొంటూ ఎన్నికల కమిషన్ ఆమ్ ఆద్మీ పార్టీకి గురువారం లేఖ రాసింది. మదర్ బోర్డ్‌ను మార్చడం ద్వారా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయాలని, అది నిరూపించేందుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఈసీని కోరిన విషయం తెలిసిందే.