8 మంది సిమి కార్యకర్తల ‘ఎన్‌కౌంటర్’ | Eight Simi terrorists are killed in the encounter | Sakshi
Sakshi News home page

8 మంది సిమి కార్యకర్తల ‘ఎన్‌కౌంటర్’

Published Tue, Nov 1 2016 3:50 AM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM

8 మంది సిమి కార్యకర్తల ‘ఎన్‌కౌంటర్’

8 మంది సిమి కార్యకర్తల ‘ఎన్‌కౌంటర్’

- భోపాల్ జైలులో సెంట్రీని చంపి పరారైన సిమి కార్యకర్తలు
- తర్వాత కొన్ని గంటలకే పోలీసు కాల్పుల్లో హతం


మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని సెంట్రల్‌ జైలు నుంచి తప్పించుకున్న 8 మంది ‘సిమి’ కార్యకర్తలు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. పటిష్ట భద్రతగల ఈ జైలు నుంచి సిమి(స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా)కి చెందిన 8 మంది ఆదివారం అర్ధరాత్రి దాటాక జైలు సెక్యూరిటీ గార్డును చంపి తప్పించుకున్నారు. ఆ తర్వాత కొన్ని గంటలకే పోలీసులతో ఎదురుకాల్పుల్లో చనిపోయారు. అయితే.. ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని, సిమి కార్యకర్తలను పట్టుకుని కాల్చిచంపారని ఆరోపణలొచ్చాయి. ఎన్‌కౌంటర్‌ తర్వాత సామాజిక మీడియాలో, టీవీ చానళ్లలో ప్రసారమైన  వీడియో క్లిప్‌లో.. నిర్జీవంగా పడివున్న సిమి కార్యకర్తలపైకి అతి సమీపం నుంచి తుపాకీతో కాలుస్తున్న దృశ్యం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.


భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న 8 మంది ‘సిమి’ కార్యకర్తలు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. పటిష్ట భద్రతగల ఈ జైలు నుంచి సిమి(స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా)కి చెందిన 8 మంది ఆదివారం అర్ధరాత్రి దాటాక జైలు సెక్యూరిటీ గార్డును చంపి తప్పించుకున్నారు. ఆ తర్వాత కొన్ని గంటలకే పోలీసుల ఎదురుకాల్పుల్లో చనిపోయారు. అయితే.. ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని, సిమి కార్యకర్తలను పట్టుకుని కాల్చిచంపారని ఆరోపణలొచ్చాయి. ఎన్‌కౌంటర్ తర్వాత సామాజిక మీడియాలో, టీవీ చానళ్లలో ప్రసారమైన  వీడియో క్లిప్‌లో.. నిర్జీవంగా పడివున్న సిమి కార్యకర్తల శరీరాలపైకి అతి సమీపం నుంచి తపాకీతో బుల్లెట్లు కాలుస్తున్న దృశ్యం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.

సిమి కార్యకర్తలు 8 మంది విచారణ ఖైదీలుగా జైలులో ఒకే సెల్‌లో ఉండేవారని.. ఆదివారం దీపావళి సంబరాల్లో మునిగివున్న సమయంలో అర్ధరాత్రి దాటాక 2-3 గంటల మధ్య వారు సెంట్రీని హతమార్చి జైలు నుంచి తప్పించుకున్నారని భోపాల్ డీఐజీ రామన్‌సింగ్ తెలిపారు. స్పూన్లు, ప్లేట్లను పదునైన ఆయుధాలుగా వాడి ఒక సెంట్రీని కట్టివేసి, మరొక సెంట్రీని చంపేశారని.. తమ దుప్పట్లను తాడుగా కట్టి, దాని సాయంతో జైలు గోడలు ఎక్కి తప్పించుకున్నారని చెప్పారు. ఈ 8 మందిలో ఇద్దరు మూడేళ్ల కిందట ఖాంద్వాలోనూ ఇదేవిధంగా జైలు నుంచి తప్పించుకుని, ఆ తర్వాత పట్టుబడ్డట్లు తెలిపారు.

ఈ ఘటనతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం గాలింపు చేపట్టింది. తప్పించుకున్న వారి ఊహాచిత్రాలను విడుదల చేసి, ఒక్కొక్కరి తలపై రూ. 5 లక్షల చొప్పున రివార్డు ప్రకటించింది. ఆ తర్వాత కొద్ది గంటలకే సెంట్రల్ జైలుకు 10 కిలోమీటర్ల దూరంలోని మాలిఖేదా గ్రామంలో ఈ 8 మందీ దాక్కున్నట్లు స్థానికుల ద్వారా సమాచారం అందిందని.. పోలీసు విభాగానికి చెందిన ఉగ్రవాద వ్యతిరేక బృందం(సీటీజీ), ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్‌లు సోమవారం ఉదయం వారిని చుట్టుముట్టగా వారు ఎదురుదాడికి దిగారని..  పోలీసులు ఆత్మరక్షణ కోసం వారిని కాల్చిచంపారని డీఐజీ  చెప్పారు. ఉగ్రవాదులు టూత్‌బ్రష్‌లు, చెక్కతో చేసిన తాళంచెవులతో జైలు గదుల తాళాల్ని తెరిచారని చెప్పారు. సిమి కార్యకర్తలు జైలు నుంచి తమ వెంట తెచ్చుకున్న పదునుదేర్చిన స్పూన్లు, ప్లేట్లు వంటి వాటిని పోలీసులపై దాడికి ఉపయోగించారని రాష్ట్ర హోంమంత్రి భూపేంద్రసింగ్ తెలిపారు.  అయితే.. వారు కరడుగట్టిన ఉగ్రవాదులని, సెమీ-ఆటోమేటిక్ తుపాకులు, పదునైన మారణాయుధాలు ఉపయోగించారని, పోలీసులపై కాల్పులు జరిపారని ఐజీ యోగేష్‌చౌదరి తెలిపారు. హోంమంత్రి, ఐజీ ప్రకటనల్లో తేడా ఉండటంతో ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు తలెత్తాయి.

 మృతులపై తుపాకీ కాల్పులు...: ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత టీవీ చానళ్లలో ప్రసారమైన వీడియో దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఎన్‌కౌంటర్ ఘటనకు సంబంధించినదిగా భావిస్తున్న ఆ వీడియోలో.. సిమి కార్యకర్తలు అచేతనంగా నేలపై పడి ఉండగా, వారిపై ఒక పోలీసు.. రైఫిల్‌తో అతి సమీపం నుంచి గురి చూసి కాల్పులు జరుపుతున్న దృశ్యం కనిపించింది. చనిపోయివున్న ఒక వ్యక్తి జేబులో నుండి కొత్తదిగా కనిపిస్తున్న కత్తిని మరొక పోలీసు  బయటకు తీయటం, మళ్లీ అదే స్థానంలో పెట్టేయడం వీడియోలో ఉంది. ‘ఇటువంటి పనులను వీడియో తీస్తారా?’ అని ఓ పోలీసు అనడం కూడా  వినిపించింది.

మరో వీడియోలో.. ఉగ్రవాదులు ఒక రాతిగుట్టపై ఉండగా, వారిని చుట్టుముట్టాలని పోలీసులు చెప్పడం వినిపించింది. ఈ  వీడియోల వాస్తవికత నిర్ధారణ కాకపోయినప్పటికీ.. సిమి కార్యకర్తలను పట్టుకుని కాల్చిచంపేసి, ఎదురుకాల్పుల్లో చనిపోయినట్లు నాటకం అల్లుతున్నారన్న అనుమానాలను బలపరుస్తున్నాయి. అయితే.. వారు ఎదురు కాల్పుల్లోనే చనిపోయారని హోంమంత్రి భూపీందర్‌సింగ్ పునరుద్ఘాటించారు. అది ఎన్‌కౌంటర్ అని, వారిని తుదముట్టించటం మినహా పోలీసులకు ప్రత్యామ్నాయం లేకపోయిందన్నారు.  సిమి ఉగ్రవాదులు జైలు నుంచి తప్పించుకోవడంపై జాతీయ దర్యాప్తు బృందం విచారణ జరుపుతుందని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ చెప్పారు.

 మృతుల వివరాలు ఇవీ...: ఎన్‌కౌంటర్ మృతులను అమ్జాద్, జాకిర్ హుస్సేన్ సాదిక్, మొహమ్మద్ సాలిక్, ముజీబ్ షేక్, మెహ్‌బూద్ గుడ్డు, మొహమ్మద్ కాలిద్ అహ్మద్, అకీల్, మాజిద్‌లుగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. వారి నుంచి తుపాకులు, ఇతర మారణాయుధాలతో పాటు, జీపీఎస్ సౌకర్యం గల రిస్ట్ వాచీలు, బెల్టులు, రన్నింగ్ షూస్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరు మధ్యప్రదేశ్, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు, బ్యాంకు దోపిడీలు, దొంగతనాలు వంటి నేరాలకు  పాల్పడ్డారన్నారు. సిమి కార్యకర్తలు జైలు నుంచి తప్పించుకున్న ఘటనకు సంబంధించి.. రాష్ట్ర జైళ్ల డీఐజీ, భోపాల్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్, డిప్యూటీ జైల్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ జైల్ సూపరింటెండెండ్‌లను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది.  జైలు నుంచి తప్పించుకోవడంపై  నివేదిక ఇవ్వాలని కేంద్రం రాష్ట్రాన్ని  కోరింది.
 
 సుప్రీం పర్యవేక్షణలో దర్యాప్తు: ఒవైసీ
 ఎన్‌కౌంటర్ వాస్తవికతను నిర్ధారించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తప్పుపట్టారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలన్నారు. హోంమంత్రి, పోలీసుల కథనాలు భిన్నంగా ఉన్నందున న్యాయ విచారణ జరపాలని మాజీ సీఎం, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ డిమాండ్ చేశారు.
 
 నెలలో కూతురి పెళ్లి..


 భోపాల్: సిమి కార్యకర్తలు భోపాల్ జైలు నుంచి తప్పించుకునేందుకు హత్య చేసిన హెడ్ కానిస్టేబుల్ రమాశంకర్‌యాదవ్ కుమార్తె వివాహం డిసెంబర్ 9వ తేదీన జరగాల్సి ఉంది. ఆయన తన కుమార్తె పెళ్లి ఏర్పాట్లలో తలమునకలై ఉండగా సిమి కార్యకర్తల చేతిలో చనిపోయాడని.. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయిందని ఆయన బంధువులు పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. రమాశంకర్ ఇద్దరు కుమారులు శంభునాథ్ (36) గువాహటిలో, ప్రభునాథ్ (32) హిస్సార్‌లో సైన్యంలో పనిచేస్తున్నారని వివరించారు.
 
 సిమి చరిత్ర ఇదీ
 మొహమ్మద్ అహ్మదుల్లా అధ్యక్షుడిగా ‘సిమి’ 1977లో ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఏర్పాటైంది. మొదట్లో ఇది జమాతే ఇస్లామీ హింద్‌కు విద్యార్థి విభాగం. అమెరికాపై సెప్టెంబర్11 దాడుల తర్వాత అదే నెలలో దీన్ని నిషేధించారు. 2008 ఆగస్ట్‌లో నిషేధాన్ని ఎత్తేసి, భద్రత దృష్ట్యా ఆ ఏడాది మళ్లీ నిషేధం విధించారు. మరో ఐదేళ్లపాటు నిషేధించాలని 2014లో కేంద్రం నిర్ణయించింది. టాడా, మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల చట్టం వంటి చట్టాల కింద సిమి సభ్యులపై కేసులు నమోదయ్యాయి. కొన్నాళ్లకు సిమి పంథాను మార్చుకుని ఉగ్రవాదం బాటపట్టింది. ఉత్తరప్రదేశ్‌లో సిమీకి ఎక్కువ పట్టుంది.
 
 ధార్వాడ టు హైదరాబాద్ వయా భోపాల్!
 సాక్షి, బెంగళూరు: ఎన్‌కౌంటర్ హతుల్లో  ముగ్గురు కొద్దికాలం పాటు కర్ణాటకలోని ధార్వాడాలో ఉన్నట్లు సమాచారం. పోలీసు వర్గాల కథనం ప్రకారం.. అబుల్‌ఫైజల్ గ్యాంగ్ సభ్యులైన ఈ ముగ్గురు 2014లో ధార్వాడ తేజశ్వినీ నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకున్నారు.  ఈ సమయంలోనే చెన్నై రైల్వేస్టేషన్‌తో పాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో పేలుళ్లకు పథకాలు రచించినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి మధ్యప్రదేశ్‌కు చేరి అక్కడ బాంబుపేలుళ్లకు పాల్పడ్డారు. తిరిగి బీదర్‌కు చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement