ప్రచారాలు.. పొత్తులు..
ఐదు రాష్ట్రాల్లో వేడెక్కుతున్న ఎన్నికల వాతావరణం
కోల్‌కతా/చెన్నై/తిరువనంతపురం/గువాహటి: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రచారంలో ఆయా పార్టీలు బిజీగా ఉన్నాయి. బెంగాల్లో తృణమూల్ ప్రచారాన్ని ఆరంభించగా, తమిళనాట డీఎండీకేతో పొత్తు కోసం కరుణానిధి కసరత్తు చేస్తున్నారు.
బెంగాల్లో మమత ప్రచారం: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు తృణమూల్ కాంగ్రెస్ ప్రచారం ప్రారంభించింది. ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారమిక్కడ భారీ ర్యాలీ నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. సీపీఎం, కాంగ్రెస్, బీజేపీలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ప్రచారం ఆరంభించామని, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నామని ప్రజలు తమకు మద్దతకు ఇవ్వాలన్నా రు. కాగా కాంగ్రెస్ పార్టీ 75 మంది అభ్యర్థులతో జాబితా ఖరారు చేసింది. హైకమాండ్ ఆమోదం పొందగానే జాబితా వెల్లడి స్తారు.
కేరళలో సినీ నటుల పోటీ: కేరళలో మలయాళ సినీ నటుల సంఘానికి చెందిన ఇద్దరు సీనియర్ సభ్యులు ఒకేస్థానం నుంచి పోటీపడుతుండటంతో అక్కడి నటులను ఇరకాటంలో పడేసింది. పఠాన్‌పురం స్థానం నుంచి నటుడు కేబీ గణేశ్‌కుమార్ ఎల్డీఎఫ్ కూటమి నుంచి, మరో నటుడు జగదీశ్‌ను కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుతున్నారు. మరోవైపు తమకు నామమాత్రంగా సీట్లు విదిలించకుండా కచ్చితంగా గెలిచే సీట్లను తమకు ఇవ్వాలంటూ కేరళ మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు అధిష్టానాన్ని డిమాండ్ చేశా రు. పార్టీలో సమర్థులైన మహిళా నేతలున్నప్పటికీ ఇంతవరకూ అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోతున్నారంటే బలహీన స్థానాలు కేటాయించటంవల్లనేనని కేరళ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బిందు అన్నారు. అటు తమిళనాడులో విజయకాంత్ సారథ్యంలోని డీఎండీకే పార్టీ తమతో పొత్తు కుదుర్చుకుంటుందని డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎం.కరుణానిధిఆశాభావం వ్యక్తం చేశారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికలను పర్యవేక్షించేందుకు యూరోపియన్ యూనియన్ బృందం గువాహటికి వచ్చింది.