ఢిల్లీలో ప్రతి ఇంట్లో కరోనా పరీక్షలు | Every House To Be Screened By July 6 In New Delhi As New Guidelines | Sakshi
Sakshi News home page

కరోనా విజృంభణ; ఢిల్లీ కీలక నిర్ణయం

Published Wed, Jun 24 2020 2:17 PM | Last Updated on Wed, Jun 24 2020 4:47 PM

Every House To Be Screened By July 6 In New Delhi As New Guidelines - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు జులై 6 నాటికి ఢిల్లీలోని ప్రతి ఇంటికి కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం బుధవారం అధికారులను ఆదేశించింది. దేశంలో కరోనా వైరస్‌ అధికంగా ఉన్న రాష్ట్రాలలో ఢిల్లీ రెండవ స్థానంలో ఉంది. అంతేగాక గడిచిన 24 గంటలలో అత్యధికంగా 3,947 కేసులు నమోదయ్యాయి. దీంతో కంటైన్మెంట్‌ జోన్లలోని ప్రతి ఇంటిలో తప్పనిసరిగా కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీలో ప్రతిరోజూ 2,500లకు పైగా కొత్త కేసులు నమోదవుతుండగా దాదాపు 75 మరణాలు చోటుచేసుకుంటున్నాయి. వీటిలో 45 శాతం కేసులు కంటైన్మెంట్‌ జోన్లలోనే నమోదవుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. కాగా కరోనా పాజిటివ్‌ వ్యక్తులు తప్పనిసరిగా కోవిడ్‌-19 సంరక్షణ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంట్లోనే ఐసోలేషన్‌ సౌకర్యం ఉన్నవారు హోంక్వారంటైన్‌లో ఉండాలని ప్రభుత్వం సూచించింది. (కరోనా అంటిస్తున్నాడని ఇటుకతో..)

కరోనా నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ కేజ్రీవాల్‌ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఇందుకోసం అమలులో ఉన్న ప్రణాళికలను సవరించి వాటి అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. జిల్లా స్థాయిలో పోలీసు కమిషనర్‌, సివిల్‌ బాడీ అధికారులు, ఎమ్‌సీడీ(మున్సిపల్‌ కార్కొరేషన్‌ ఆఫ్‌ న్యూఢిల్లీ) ఎపిడెమియాలజిస్టులు, కోవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌‌ న్యాయాధికారులు కరోనా కట్టడి చర్యలను పర్యవేక్షిస్తారు. ఆరోగ్య సేతు యాప్‌ను పర్యవేక్షించడానికి.. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ కోసం ప్రత్యేకంగా ఐటీ నిపుణులను ప్రభుత్వం నియమించింది. కాబట్టి ఇకపై ఆరోగ్యసేతు యాప్‌ను ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, ముఖ్యంగా కాలుష్య ప్రభావిత పరిసరాల్లోని వారు తప్పనిసరి అని ప్రభుత్వం ఆదేశించింది. (ప్రాణాలే పణంగా..!)

సీసీ కెమెరాల ద్వారా పోలీసులు కంటైన్మెంట్‌ జోన్‌ల కదలికను నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. సవరించిన మార్గదర్శకాల ప్రకారం ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) రాపిడ్‌ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వం చెప్పింది. రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌కు ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తారు. ఇక జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ వ్యక్తులను కోవిడ్‌-19 సంరక్షణ కేంద్రాలకు పంపించే ఏర్పాట్లు చేయడంతో పాటు కంటైన్మెంట్‌ జోన్‌లో 5 నుంచి 10 రోజుల మధ్య కరోనా పరీక్షలు జరుపుతారు. శనివారం(జూన్ 27) నుంచి దేశ రాజధానిలో కరోనా వైరస్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు రోజుకు ఇరవై వేల చొప్పున సేకరించిన నమూనాల ఫలితాలను జూలై 10న విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement