కపిల్ ఇంటి కిరాయి అక్షరాలా రూ. 16 లక్షలు
కపిల్ ఇంటి కిరాయి అక్షరాలా రూ. 16 లక్షలు
Published Tue, Jun 24 2014 11:06 PM | Last Updated on Sat, Sep 2 2017 9:20 AM
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ మారనున్న ఇంటి అద్దె ఎంతో తెలుసా. అక్షరాలా రూ. 16 లక్షలట. యూపీఏ సర్కారులో పదేళ్లు కేబినెట్ మంత్రిగా ఉన్న సిబల్.. తీన్‌మూర్తి రోడ్డులోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి అన్ని సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన అద్దె ఇంటికి మారనున్నారు. జోర్‌బాగ్ ప్రాంతంలోని ఈ ఇంటికి ఆయన త్వరలో మారనున్నారు. నగరంలో అత్యంత అధిక అద్దె పలుకుతోన్న భవనాల్లో ఇదొకటని అంటున్నారు. చాందినీచౌక్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయిన కపిల్ సిబల్ ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి ఆగస్టు ఒకటో తేదీన అద్దె ఇంటికి మారనున్నారు.
ఎమ్మార్ ఎంజీఎఫ్ ప్రమోటర్ శ్రవణ్ గుప్తా బావమరిది సిద్ధార్థ్ సరీన్ బంగ్లాను ఆయన అద్దెకు తీసుకున్నారు. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త అయిన సరీన్త్ ఈ ఇంటికి నెలకు 18 లక్షల రూపాయల అద్దె డిమాండ్ చేశారని, పదహారు లక్షలకు అద్దె ఒప్పందం కుదిరిందని అంటున్నారు. దేశంలోని ప్రముఖ న్యాయవాదులలో ఒకరైన కపిల్ సిబల్ ఈ ఇంట్లో నుంచి లా ప్రాక్టీసు చేయాలనుకుంటున్నారు. ఆయన లా ఆఫీసు కూడా ఇదే భవనంలో ఏర్పాటుచేసుకోనున్నారు. కార్పొరేట్, రాజ్యాంగ వ్యవహారాలలో దిట్ట అయిన కపిల్ సిబల్ అనేక ప్రముఖ కేసులలో తన సత్తా చూపారు. మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో సభ్యుడయ్యాక ఆయన తన న్యాయవాద వృత్తిని పక్కనపెట్టారు. లుట్యెన్స్ జోన్‌లో బంగ్లాలు తక్కువగా, డిమాండ్ ఎక్కువగా ఉన్నందువల్ల ఎక్కువ అద్దెలు పలుకుతున్నాయని రియల్టర్లు అంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన 265 మంది ఎంపీలు ప్రభుత్వ భవనాలను ఖాళీ చేయాల్సి ఉంది.
వారిలో పలువురు లుట్యెన్స్ జోన్‌లోని ప్రైవేటు భవనాలకు మారాలనుకుంటున్నారు. ప్రధాన నివాసం, పార్లమెంట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు నెలవైన లుట్యెన్స్ జోన్‌లో నివసిం చడం తమకు హోదాకు అనుగుణంగా ఉంటుందని పలువురు రాజకీయవేత్తలు, వాణిజ్య వేత్తలు భావిస్తుంటారు. లుట్యెన్స్ జోన్‌లో 1000 పైగా బంగ్లాలు ఉన్నాయి. అయితే ఇందులో కేవలం 10 శాతం మాత్రమే ప్రయివేటు బంగ్లాలు, ఈ బంగ్లాలో కొన్ని దేశంలోని ప్రముఖ వాణిజ్యవేత్తలకు చెందినవి. ఎల్‌ఎన్ మిట్టల్, కేపీసింగ్ , సునీల్ మిట్టల్, నవీన్ జిందాల్ వంటి వాణిజ్యవేత్తలకు ఈ ప్రాంతంలోనే సొంత భవనాలున్నాయి.
Advertisement