గంట కొట్టకముందే బడికి వెళ్లాల్సి ఉన్నా, తొట్రుపాటులేకుండా, క్రమశిక్షణ తప్పకుండా పద్ధతిగా వెళతారు విద్యార్థినీ విద్యార్థులు. అదే ప్రజాస్వామ్యానికి దేవాలయంలా భావించే పార్లమెంట్ కు హజరయ్యే క్రమంలో 'పెద్ద'లైన ఎంపీలు మాత్రం ఇష్టారీతిగా ప్రవర్తిస్తూ, నిబంధనల్ని అతిక్రమిస్తున్నారు. బడ్జెట్ భేటీలో భాగంగా సోమవారం ప్రారంభమైన రెండో దశ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనలు మరోసారి ఎంపీల నీర్లక్ష్యవైఖరిని కళ్లకుకట్టాయి.
సీన్ నంబర్ 1
సోమవారం ఉదయం పదిన్నర గంటలు దాటిన తర్వాత పార్లమెంట్ వైపునకు నారింజపండు రంగులోని ఓ కారు సర్రున దూసుకొచ్చింది. రిజిస్ట్రేషన్ నంబర్ డీఎల్ 9 సీఏ 1914. చివరిది సరి అంకె. సరి బేసి నిబంధనల ప్రకారం ఢిల్లీలో ఇవ్వాళ బేసి నంబర్ ఉన్న వాహనాలకు మాత్రమే వినియోగించాలి. అహ్మదాబాద్ (ఈస్ట్) స్థానం నుంచి లోక్ సభకు ఎంపికైన ఈ బీజేపీ ఎంపీ గడిచిన రెండేళ్లుగా ఢిల్లీలోనూ ఉంటున్నారు. ఆయనకు సరి-బేసి నిబంధన తెలియదనుకోవటం పొరపాటే!అలా నిబంధనలను బేఖాతరు చేసిమరీ పార్లమెంట్ లోకి పోతున్న ఆయనను చుట్టుముట్టిన మీడియా ప్రతినిధులు 'ఎందుకిలా రూల్స్ బ్రేక చేశారు?' అని అడితే పొంతనలేని సమాదానాలిచ్చి వెళ్లిపోయారు.. ఆ తర్వాత కొద్దిసేపటికి 'పెద్ద నేరం చేశాను. క్షమించండి' అంటూ ఢిల్లీ ప్రజలు, సీఎం కేజ్రీవాల్ కు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు ఎంపీ పరేశ్ రావల్.
సీన్ నంబర్ 2
టైర్ల నిండా గాలి, ట్యాంకు నిండా పెట్రోలుతో శ్రుభ్రంగా ముస్తాబయిన బస్సు స్టాప్ లోకి వచ్చి ఆగింది. ఇద్దరు తప్ప బస్సులో ఎక్కడానికి ఎక్కువమంది రాలేదక్కడికి. ఆ స్టాప్.. ఎంపీల క్వార్టర్స్. ఆ బస్సు.. కేవలం ఎంపీలను పార్లమెంట్ కు చేరవేసేందుకు డీటీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు. బీజేపీ ఎంపీలు రాంజన్ భట్, హరి ఓమ్ సింగ్ రాథోడ్ లు మాత్రమే స్పెషల్ బస్సును వినియోగించుకున్నారు. మిగతావాళ్లంతా తమ తమ సొంత (నిజానికి అవికూడా ప్రభుత్వ వాహనాలే) కార్లల్లో పార్లమెంట్ కు వచ్చారు.
ప్రధాని, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు, ఇతర కీలక పదవుల్లో ఉన్నవారిని మినహాయిస్తే పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ఎంపీల కోసం ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్(డీటీసీ) ఆరు ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసింది. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆదేశాలమేరకు ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ గోపాల్ రాయ్ దగ్గరుండిమరీ బస్సులను సిద్ధంచేశారు. కాలుష్య నియంత్రణతోపాటు క్రమశిక్షణా అలవర్చుకోవచ్చనే ఉద్దేశంతో గత డిసెంబర్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీల కోసం ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ బస్ సర్వీసులను ప్రారంభించారు. ఇప్పుడా ఎలక్ట్రిక్ బస్సు జాడలేదు. డీటీసీ ఏర్పాటుచేసిన బస్సును ఎక్కడానికేమో ఎంపీలు ముందుకు రావట్లేదు!
ఓఎంజీ! పరేశ్ రూల్స్ బ్రేక్ చేశాడు!!
Published Mon, Apr 25 2016 12:23 PM | Last Updated on Sun, Sep 3 2017 10:43 PM
Advertisement
Advertisement