
దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ....
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆర్థిక అత్యయిక పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోడ్లు, దుకాణాలు, మాల్స్, సినిమా హాల్స్, హోటల్స్, వైన్స్, బార్స్, బస్సులు బోసిపోగా బ్యాంకులు కిక్కిర్సిన జనంతో కిటకిటలాడుతున్నాయి. ఏటీఎం సెంటర్లు కొన్ని తెరవకపోగా తెరిచిన సెంటర్లు కూడా క్యాష్ అవుట్‌తో తెరవనట్లుగానే మూతపడి పోయాయి. ఇదేమిటని బ్యాంక్ మేనేజర్లను ఖాతాదారులు నిలదీయగా, బ్యాంక్ కౌంటర్ల ముందు పడిగాపులు గాస్తున్న కస్టమర్లకే సకాలంలో డబ్బులు చెల్లించలేక పోతున్నామని, ఇంకా ఏటీఎం గోడు వినే సమయం ఎక్కడదంటూ సమాధానం ఇస్తున్నారు.
బ్యాంకుల్లో కూడా ఐదొందలు, వంద, అంతకన్నా తక్కువ నోట్ల నిల్వలు హారతి కర్పూరంలా కరగిపోగా నోట్లు మార్చుకునేందుకు వచ్చిన కస్టమర్ల చేతుల్లో రెండువేల రూపాయల నోట్లు పెడుతున్నారు. అసలే చిల్లర దొరక్క చస్తుంటే రెండువేల రూపాయల నోట్లను ఏం చేసుకోవాలని కస్టమర్లు ప్రశ్నిస్తున్నారు. మొదటి రోజున కొత్త నోట్లతో సెల్ఫీలు దిగి కస్టమర్లు కాస్త సంతోషం వ్యక్తం చేయగా, రెండో రోజు నుంచి నోట్లు మార్చుకున్న కస్టమర్లు కన్నీటి పర్యంతం అవుతున్నారు. పొద్దుటే టిఫిన్ తిని మధ్యాహ్నానికి లంచ్, రాత్రికి డిన్నర్ కట్టుకొని, వీలు అయితే చాపచుట్ట పట్టుకొని బ్యాంకుల వద్దకు వెళ్లాలంటూ సోషల్ మీడియాలో సూచనలు, సలహాలు వెల్లువెత్తుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
పొలం అమ్మిన సొమ్మును ఇంట్లో పెట్టుకొన్న ఓ అమ్మ ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకొందని, ఓ ముసలి అమ్మ తన దగ్గరున్న ఐదు వందల నోట్లు చెల్లవని తెలిసి గుండాగి చనిపోయిందని, ఆస్పత్రిలో ఏ ఎనిమిదేళ్ల పాప తండ్రి సకాలంలో మందులు కొనుక్కరాలేక పోవడం వల్ల మరణించిదనే వార్తలు దేశం నలుమూలల నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఏటీఎంల చుట్టూ తిరుగుతూ తాము ఎదుర్కొన్న ఇబ్బందులను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా పర్యాటకులు పడుతున్న ఇబ్బంది అంతా, ఇంతా కాదు. చేతిలో నిషేధించిన నోట్లను మార్చుకోలేక లేదా మార్చుకునే సమయం లేక, అన్ని చోట్ల డెబిట్ కార్డ్ సౌకర్యం అందుబాటులోలేక వారు ఎన్నో ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సర్టికల్ స్ట్రైక్స్ అని తొలుత ప్రశంసించిన వారు కూడా టైమ్ అండ్ సెన్స్ లేని సర్జికల్ స్ట్రైక్స్ అని ఇప్పుడు బాధ పడుతున్నారు.