
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం నడిబొడ్డులో రెండు చోట్ల మంగళవారం అగ్ని ప్రమాదాలు సంభవించాయి. దీంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఆల్ ఇండియా మెడికల్ ఇన్సిస్టిట్యూట్ (ఎయిమ్స్)లో మొదటి అంతస్తులోని వార్డులో ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో మంటలంటుకుంటున్నాయి. దీంతో రోగులు, వారి బంధువులు భయంతో పరుగులు తీశారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పైర్ సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. \అందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని..అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఎయిర్ కండిషనర్లోని వైరు ద్వారా షార్ట్ సర్య్కూట్ కావడంతోనే ప్రమాదం జరిగిందని వారు తెలిపారు.
మరోవైపు ఢిల్లీలోని కన్నౌట్ ప్లేస్లోని నాలుగంతస్థుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలోని ఓరియంటల్ బ్యాంక్ ఆవరణలో భారీ మంటలు చెలరేగాయి. దాదాపు 20 అగ్నిమాపక శకటాలు మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాయని అధికారులు తెలిపారు. చుట్టపక్కలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు గాయపడినట్టుగా సమాచారం. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.