-10.95% మేర పెరిగిన బడ్జెట్
న్యూఢిల్లీ: రక్షణ రంగానికి బడ్జెట్ పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలతో (రూ.2.22 లక్షల కోట్లు) పోల్చుకుంటే కేటాయింపులు 10.95 శాతం మేరకు పెరిగాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2,46,727 కోట్ల బడ్జెట్‌ను కేంద్రం కేటాయించింది. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటాన్ని నిరోధించేందుకు ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాపై దృష్టి పెట్టడంతో కేటాయింపులు పెరిగాయి. గత ఏడాది బడ్జెట్‌లో వాస్తవానికి రూ.2.29 లక్షల కోట్లు కేటాయించినప్పటికీ.. తర్వాత దానిని రూ.2,22,370 కోట్లకు సవరించారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మొత్తం ఖర్చు (రూ.17,77,477.04 కోట్లు)లో రక్షణ బడ్జెట్ 13.88 శాతంగా ఉంది. అయితే రక్షణ రంగం కోసం చైనా చేస్తున్న ఖర్చుతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువేనని చెప్పాలి.
2014-15లో చైనా అధికారికంగా ఈ రంగానికి వెచ్చించిన మొత్తం సుమారు రూ.8 లక్షల కోట్లు. అయితే మన మాతృభూమికి చెందిన ప్రతి అంగుళం భూమిని పరిరక్షించడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. రక్షణ రంగంలో ఇప్పటికే ఎఫ్‌డీఐని అనుమతించిన విషయం ప్రస్తావిస్తూ.. భారతీయ సంస్థలు రక్షణ పరికరాల ఉత్పత్తిదారులుగా మారేందుకు, కేవలం మనకోసమే కాకుండా ఎగుమతులకు కూడా ఇది దోహదపడుతుందని చెప్పారు.
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా ఎయిర్ క్రాఫ్ట్‌లతో పాటు ఇతర రక్షణ పరికరాల తయారీలో భారత్ స్వయం సమృద్ధిని సాధించే దిశగా ప్రభుత్వం కృషి కొనసాగిస్తుందన్నారు. రక్షణ పరికరాల కొనుగోళ్లకు సంబంధించిన నిర్ణయాల్లో ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా, వేగంగా వ్యవహరిస్తుందని చెప్పారు. సాయుధ దళాల అవసరాలకు అనుగుణంగా ఈ ఏడాది కూడా కేటాయింపులు జరిపినట్లు జైట్లీ పేర్కొన్నారు. మొత్తం రక్షణ బడ్జెట్‌లో 38 శాతం అంటే రూ.94,588 కోట్లు మిలటరీ ఆధునీకరణ కోసం కేటాయించడం విశేషం. అయితే ఆధునీకరణ కోసం గత ఏడాది కోసం కేటాయించిన రూ.12,622 కోట్లు ఖర్చు చేయకపోవడం గమనార్హం.