
ఆర్మీ మాజీ అధికారి అరెస్టు
న్యూఢిల్లీ: అక్రమంగా సేకరించిన కాల్ డిటెయిల్స్ రికార్డులను(సీడీఆర్) వేరే వారికి విక్రయించిన కేసులో ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఆర్మీకి చెందిన ఓ అధికారి కూడా ఉన్నాడు. డీకే గిరి అనే కెప్టెన్ స్థాయిలో పనిచేసిన ఆర్మీ మాజీ అధికారి హైదరాబాద్లో షార్ప్ డిటెక్టివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను నిర్వహిస్తున్నాడు.
ఓ ప్రైవేటు విభాగం ద్వారా సైంటిఫిక్ అప్రొచెస్తో పలు విచారణలు విజయవంతంగా చేసిన గిరికి గతంలో రత్న షిరోమణి అవార్డు కూడా వచ్చింది. అయితే, ఆయన మరో వ్యక్తి కలిసి అక్రమంగా కాల్ డిటెయిల్స్ రికార్డులను సంపాదించడమే కాకుండా వాటిని ఇతరులకు విక్రయించారంట. దీనినే ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు సీడీఆర్ రాకెట్ గా పేర్కొంటూ దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ రాకెట్ కేసు కింద ఎనిమిదిమందిని అరెస్టు చేశారు. వీరిలో జైపూర్ పోలీస్ సైబర్ సెల్లో పనిచేస్తున్న ఓ ఎస్సై కూడా ఉన్నాడు. రెండు రోజుల కిందట గిరిని అరెస్టు చేసి తీసుకెళ్లినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు.