
ప్రమాదవశాత్తూ నీట మునిగిన బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే వారిస్ అలీ
లక్నో : బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే వారిస్ అలీ బహ్రెచ్‌లోని తన ఇంట్లో ప్రమాదవశాత్తూ చేపల చెరువులో పడి మరణించారు. అలీ 2007 నుంచి 2012 వరకూ నన్పారా ఎమ్మెల్యేగా వ్యవహరించారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన బీఎస్పీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసిన అలీ తిరిగి ఓటమి పాలయ్యారు. కాగా ఆదివారం ఉదయం రోజూలాగే తన ఇంట్లో ని వ్యవసాయ క్షేత్రంలో మార్నింగ్ వాక్‌కు వెళ్లిన అలీ ఎప్పటిలాగే చేపలచెరువు చుట్టూ తిరుగుతుండగా పట్టు కోల్పోయి చెరువులో పడినట్టు పోలీసులు తెలిపారు.
ఈత రానందున ఆయన చెరువులో మునగడంతో మరణించారని చెప్పారు. పోలీసులు ఆయన మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టంకు తరలించారు. మాజీ ఎమ్మెల్యే మరణానికి సంబంధించి పోస్ట్‌మార్టం నివేదిక అందిన తర్వాత సరైన కారణాలు వెలుగుచూస్తాయని పోలీసులు తెలిపారు.
గతంలో బీఎస్పీ అధినేత్రి మాయావతికి అత్యంత సన్నిహితుడైన వారిస్ అలీకి మైనారిటీ నేతగా మంచి గుర్తింపు ఉంది. కాగా, పార్టీ నేత మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు యూపీసీసీ చీఫ్ రాజ్‌బబ్బర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.