రెండుసార్లు ఎమ్మెల్యే.. రోడ్డు పక్కనే బతుకు
గర్షంకర్(హోషియార్పూర్, పంజాబ్): ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఎక్కడా ఒక్క అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు లేవు. తన పార్టీ అధినేత దృష్టిలో మంచి పేరు. పార్టీ అధినేత చనిపోయారు. ఆయన ఇప్పుడు రోడ్డున పడ్డాడు. కట్టుబట్టలతో సహా భార్య బిడ్డలతో కలిసి ఓ రోడ్డు పక్కనే కాలం వెల్లదీస్తున్నాడు. జోరు వానలు ఊపందుకుంటున్న ఈ తరుణంలో నాలుగు ఇనుపకడ్డీలకు టార్పాన్లు కట్టి దానికిందే అతి కష్టం మీద బతుకీడుస్తున్నాడు. ఇది పంజాబ్లోని ఓ మాజీ ఎమ్మెల్యే దుస్థితి. పంజాబ్ లోని హోషియార్పూర్ జిల్లాలోని షింగారా రామ్ షహుంగ్రా అనే మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు.
ఆయన బహుజన్ సమాజ్ వాది పార్టీకి చెందినవాడు. కాన్సీరాం ఉన్న సమయంలో 1992, 1997 సంవత్సరాల్లో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే అయినప్పటికీ రెండుసార్లు కూడా జనరల్ స్థానం నుంచే గెలుపొందాడు. అయితే, రానురాను అతడిని పార్టీ నిర్లక్ష్యం చేసింది. పూర్తిగా బయటకు గెంటేసింది. దీంతో మొన్నటి వరకు ప్రభుత్వ ఇరిగేషన్ డిపార్ట్ మెంట్కు చెందిన ఇంట్లో కాలం వెళ్లదీయగా తాజాగా పంజాబ్ ప్రభుత్వం వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించింది. దీంతో వారు ఎక్కడికి వెళ్లకుండా రోడ్డుపక్కనే ఓ డేరా కట్టుకొని ఉంటున్నారు. ఆయన భార్య రోడ్డుపక్కనే ఓ కట్టెలపొయ్యిపై చపాతీలు చేస్తుండగా కుమారులు వారికి సహాయపడుతున్నారు.
తనకు వచ్చే రూ.20వేల పెన్షన్ తో ఒక ఇల్లు తీసుకొని ఉండొచ్చని, కానీ తాను మాత్రం ఇలాగే బతికేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. తాను పదవిలో ఉండగా ఒక్క రూపాయి లంఛం తీసుకోలేదని, అవినీతికి పాల్పడలేదని, కనీసం సొంత నివాసం నిర్మించుకునే ఆలోచన కూడా చేయలేదని అన్నారు. ఊర్లో కష్టం చేసుకుని బతికే తమ సోదరులు మాత్రం చక్కగా ఇల్లుకట్టుకొని జీవిస్తున్నట్లు చెప్పారు. 'కింది కులాలవారికి అధికారం దక్కేందుకు కాన్షీరాం చేసిన పోరాటంలో భాగస్వామ్యం అయ్యేందుకు రాజకీయాల్లోకి వచ్చాను. నా రెండు దఫాల పదవీకాలంలో ఏ ఒక్కసారి డబ్బు వెనుకేసుకోవాలనే ఆలోచన చేయలేదు' అని ఆయన అన్నారు.