పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే దళిత, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఇకపై ఉచిత కోచింగ్ అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పటివరకు ఉన్న రూ.20 వేల పరిమితిని ఎత్తివేసిన కేంద్రం
న్యూఢిల్లీ: పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే దళిత, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఇకపై ఉచిత కోచింగ్ అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఉన్న రూ. 20 వేల పరిమితిని ఎత్తివేస్తూ కోచింగ్ పథకాన్ని కేంద్ర సామాజిక న్యాయం-సాధికారత శాఖ సవరించింది. నాణ్యమైన శిక్షణనిచ్చే సంస్థలను ఎంపిక చేసి, వాటిలో చేరిన ఎస్సీ, ఓబీసీ అభ్యర్థులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తుంది. ‘ఎస్సీ, ఓబీసీ అభ్యర్థులకు నాణ్యమైన శిక్షణను ఉచితంగా అందించి, వారు మంచి ఉద్యోగం పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సవరణ చేసింది. ఇందులో భాగంగా అభ్యర్థులకు ఇచ్చే రూ.20 వేల పరిమితిని ఎత్తివేశారు. ఇకపై మొత్తం ఫీజు కేంద్రమే చెల్లిస్తుంది’ అని మంత్రిత్వ శాఖ పేర్కొంది,. సవరించిన నిబంధనల ప్రకారం.. కనీసం 5 నుంచి అత్యధికంగా 10 ప్రముఖ కోచింగ్ సెంటర్ల పేర్లను సూచించాలని రాష్ట్రాలను కేంద్రం కోరుతుంది. ఈ ప్రతిపాదనలను సెలక్షన్ కమిటీ పరిశీలిస్తుంది. గత రికార్డుల ఆధారంగా కోచింగ్ సెంటర్లను ఖరారు చేస్తుంది. ఇతర రాష్ట్రాల్లో కూడా శాఖలున్న సెంటర్లకు ప్రాధాన్యం ఉంటుంది. కుటుంబ వార్షికాదాయం రూ.6 లక్షల లోపున్నవారికే పథకం వర్తిస్తుంది.
ఉపకారవేతనం రూ.2,500 కు పెంపు
పథకం మార్పులో భాగంగా కోచింగ్ తీసుకొనే అభ్యర్థులకు నెలనెలా ఇచ్చే ఉపకార వేతనాన్నీ పెంచారు. స్థానిక అభ్యర్థులకు రూ.1,500కు బదులు రూ.2,500 ఇస్తారు. ఇతరులకు రూ.3,000 బదులు రూ.5,000 అందిస్తారు. వైకల్యం ఉన్నవారికి రీడర్, ఎస్కాట్, హెల్పర్ అలవెన్స్‌లతో పాటు నెలకు రూ.2,000 స్పెషల్ అలవెన్స్‌ల కింద చెల్లిస్తారు. కోచింగ్ ఫీజుతో పాటు ఉపకార వేతనాన్నీ నేరుగా శిక్షణ కేంద్రాలకు అందిస్తారు. గ్రూప్-ఏ, బీ, యూపీఎస్‌సీ వంటి పోటీ పరీక్షలతో పాటు ఐఐటీ-జేఈఈ, సీశాట్ తదితర ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్‌మెంట్ కోచింగ్‌లకు ఈ పథకం వర్తిస్తుంది. ఇవేకాకుండా శాట్, జీఆర్‌ఈ, జీమాట్, టొఫెల్ వంటి అర్హత పరీక్షలకు కూడా ఇది వర్తిస్తుంది.