గాలి జనార్దనరెడ్డికి బెయిలు
బెంగళూరు: అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ(ఏఎంసీ) వ్యవహారానికి సంబంధించిన కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి ఇక్కడి సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రూ.10 లక్షలకు వ్యక్తిగత బాండుతో పాటు ఇద్దరు పూచీకత్తులను సమర్పించాలని, సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించకూడదని, విచారణకు హాజరు కావాలని షరతులు విధించింది. రెండున్నర సంవత్సరాల క్రితం అరెస్టు అయినప్పటి నుంచీ జనార్దన రెడ్డికి బెయిల్ లభించడం ఇదే తొలిసారి.
ఈ కేసుకు సంబంధించి గతంలో సీబీఐ ప్రత్యేక కోర్టుతో పాటు హైకోర్టు తన బెయిల్ అర్జీలను తిరస్కరించడంతో జనార్దనరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెండున్నరేళ్లవుతున్నా ఇంకా విచారణే ప్రారంభం కాలేదని, అలాంటప్పుడు తననెందుకు నిర్బంధంలో ఉంచాలని ప్రశ్నిస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. విచారణ ప్రారంభం కానప్పుడు, ఆయన దాఖలు చేసే బెయిల్ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సీబీఐ కోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. కాగా, కీలకమైన ఈ కేసులోనే బెయిల్ లభించడంతో మిగిలిన కేసుల్లో కూడా ఆయనకు బెయిల్ లభించవచ్చని పలువురు భావిస్తున్నారు.