కుండీలో చెత్తవేస్తే.. వైఫై ఫ్రీ
న్యూఢిల్లీ: ఆధునిక ప్రపంచంలో ఇంటర్నెట్ అవసరాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సమస్త సమాచారాన్ని చిటికెలో అందిస్తూ విజ్ఞానానికి, వినోదానికి వేదికగా నిలుస్తోంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ ప్రాథమిక అవసరంగా మారింది. అపరిశుభ్రత.. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఇదీ ఒకటి. సగం రోగాలు అపరిశుభ్రత కారణంగానే వ్యాపిస్తాయి. ప్రస్తుతం దేశానికి ఇది ప్రాథమిక సమస్యగా మారింది. తమ వినూత్న ఆలోచనతో ఈ రెండింటికీ ఒకే పరిష్కారం కనుగొన్నారు ముంబైకి చెందిన ఇద్దరు కామర్స్ గ్రాడ్యుయేట్లు. అదెలాగో మీరూ చూడండి.
'వైఫై ట్రాష్ బిన్'
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే.. వైఫై ఉచితంగా అందించే ఓ సరికొత్త ప్రయత్నం చేశారు ముంబైకి చెందిన ప్రతీక్ అగర్వాల్, రాజ్ దేశాయ్. ఇందుకోసం 'వైఫై ట్రాష్ బిన్'పేరుతో డస్ట్‌బిన్‌ను ఏర్పాటుచేశారు. ఇందులో చెత్తవేస్తే వైఫై ఉచితంగా ఉపయోగించుకునేందుకు అవసరమైన కోడ్ వస్తుంది. ఈ కోడ్ ద్వారా వైఫైని ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు.
ఆలోచన ఇలా
ముంబైలో ఓ వారంతంలో వారు వెళ్లిన ఓ పార్టీ ఈ ఆలోచనకు కారణమైంది. విశాలమైన ప్రాంతంలో జరిగిన ఆ మ్యూజిక్ ఫెస్టివల్.. మ్యూజిక్, ఫుడ్, డ్రింక్స్‌తో పాటు పెద్ద మొత్తంలో చెత్తకు కూడా వేదికైంది. నెట్‌వర్క్ కూడా లేని కారణంగా అక్కడ తమ స్నేహితులను గుర్తించేందుకు తమకు ఆరుగంటలకు పైగా పట్టినట్లు అగర్వాల్ తెలిపారు. దీంతో హాట్‌స్పాట్స్ ద్వారా ఉచితంగా వైఫై ఎందుకు అందించకూడదు అనే ఆలోచన ఆ సమయంలో తనకు వచ్చినట్లు చెప్పారు. ఈ ఆలోచనకు డెన్మార్క్, ఫిన్‌లాండ్, సింగపూర్ తదితర దేశాల్లో శుభ్రతకు చేపట్టిన సరికొత్త పద్ధతులు స్ఫూర్తిగా నిలిచాయని తెలిపారు.
సొంత నిధులతో టెలికం ఆపరేటర్ ఎంటీఎస్ సహాయంతో బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో జరిగే వారాంతపు వేడుకల్లో దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించాలని భావించినా అది అప్పట్లో కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం గెయిల్ నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లు, చర్చలు జరుగుతున్నట్లు అగర్వాల్ తెలిపారు. కనెక్టివిటీ, మొబిలిటీ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలు వెలికితీసేందుకు ఎరిక్సన్, సీఎన్ ఎన్ ఐబీఎన్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన 'నెట్‌వర్కడ్ ఇండియా'కార్యక్రమంలో ఇటీవల ఈ వైఫై బిన్స్‌ను ప్రదర్శించారు.