
‘సిక్కు’లకు పరిహారం ఇవ్వండి
- అన్ని రాష్ట్రాల సీఎంలకు హోంమంత్రి రాజ్‌నాథ్ ఆదేశం
- 17 బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చెక్కుల పంపిణీ
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన సిక్కల ఊచకోతలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందేలా గట్టి చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన సీఎంలకు లేఖ రాశారు.
నాటి ఘటనలో మొత్తం 3,325 మంది ప్రాణాలు కోల్పోయారు, వీరిలో 2,733 మంది ఢిల్లీకి చెందినవారుకాగా, మిగిలిన వారు హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, జమ్మూకశ్మీర్ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన వారున్నారని పేర్కొన్నారు. వీరి కుటుంబాలకు అందిన పరిహారం వివరాలను ఎప్పటికప్పుడుకు కేంద్ర హోం శాఖకు తెలియజేయాలని సీఎంలను రాజ్‌నాథ్ కోరారు.
ఈ క్రమంలో శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సిక్కుల ఊచకోత బాధిత 17 కుటుంబాలకు మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రూ. 5 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ఎన్ని కోట్ల రూపాయల పరిహారం ఇచ్చినా బాధితుల దుఖం తీరనిదని ఆవేదన వ్యక్తం చేశారు. సిక్కు అలర్ల బాధితుల ఫిర్యాదుల పరిష్కారానికి ఓ కమిటీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలోనే కేంద్రం సిక్కులకు పరిహారం పంపిణీ చేస్తోందని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు విమర్శించాయి.