ప్రపంచ పెద్ద పార్టీనా.. ఓట్లేవి.. అంతా మోసం
పనాజీ: ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించడంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. బీజేపీ ఎప్పుడూ నెంబర్ గేమ్ ఆడుతుందని, వాటితో మోసం చేస్తుందని ఆరోపించింది. గోవా కాంగ్రెస్ కార్యదర్శి దుర్గా దాస్ కామత్ ఈ విషయంపై గోవాలో ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ చెప్పే సభ్యత్వ సంఖ్యకు అది పొందే ఓట్లకు సంబంధం లేకుండా ఉంటుందని అందులో పేర్కొన్నారు. ఇటీవల కాలంలో గోవాలో ఓ జిల్లా పంచాయతీ ఎన్నికల సమయంలో ఆ పార్టీలో మొత్తం నాలుగు లక్షలమంది సభ్యత్వం నమోదు చేసుకున్నారని చెప్పిందని, కానీ మార్చిలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు 1,50,674 మాత్రమేనని అన్నారు.
అంటే వారు చెప్పిన ప్రకారం మిగితా వాళ్లంతా సొంతపార్టీకే ఓటెయకుండా వెనక్కి వెళ్లిపోయారా.. లేక సభ్యత్వం రద్దు చేసుకున్నారా అని ప్రశ్నించారు. ఒక్క చిన్న రాష్ట్రమైన గోవాలో సభ్యత్వాల విషయంలోనే ఆ పార్టీ ఇంత మోసం చేసి ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా సభ్యత్వ సంఖ్యపై మోసం చేసిందని అన్నారు. దీనికి వెంటనే స్పందించిన గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ ఓట్లు తక్కువగానే వచ్చినా తమ పార్టీ సభ్యులు అలాగే ఉన్నారని చెప్పారు. జిల్లా పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ప్రాంతాలు కవర్ కాలేదని అందుకే మిగితా ఓట్లు పడలేదని చెప్పారు.