జకీర్కు బిగుస్తున్న ఉగ్రవాద ఉచ్చు!
న్యూఢిల్లీ: ఇస్లామిక్ మత వివాదాస్పద ప్రచారకుడు జకీర్ నాయక్కు ఉచ్చుబిగించేందుకు కేంద్రం సిద్ధమవుతుంది. ఆయనపై ఉగ్రవాద నేర ఆరోపణలు నమోదుచేసేందుకు ముందుకు వెళుతుంది. ఇప్పటికే ఆయన స్థాపించిన ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్ ను (ఐఆర్ఎఫ్)ను చట్ట వ్యతిరేకమైన స్వచ్ఛంద సంస్థగా ప్రకటించింది. ఉగ్రవాద ఆరోపణల కింద దొరికిన వారిలో 50శాతం మంది జకీర్ నాయక్ ప్రోత్సాహం పొందారని తెలిసిన నేపథ్యంలో ఆయనపై త్వరలోనే ఈ మేరకు కేంద్రం ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ముస్లిం యువకులను రెచ్చగొట్టేలా ప్రసంగాలు ఇవ్వడం మూలంగా మోటివేట్ అయిన వారు ఢాకాలోని రెస్టారెంట్ పై దాడికి పాల్పడినట్లుగా కూడా విచారణలో తెలిసినట్లు సమాచారం.
జకీర్ పై చర్యలకు ఇప్పటికే కేంద్ర హోంశాఖశాఖ న్యాయ సలహాను కూడా తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయంతో ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. న్యాయ సలహా ప్రకారం జకీర్ పై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ) కింద కేసులు నమోదు చేయవచ్చని సమాచారం. పోలీసులకు దొరికిన పలువురు ఉగ్రవాదులు కూడా జకీర్ నాయక్ ప్రసంగాల నుంచే దాడులకు స్ఫూర్తిని పొందామని చెప్పారని, అందుకే ఆయనపై ఉగ్రవాద ఆరోపణలు నమోదుచేసేందుకు సిద్ధమవుతున్నామని ఓ కీలక అధికారి చెప్పారు.