వైభవంగా పూరీ రథయాత్ర | grand start to sri Jagannath Rath Yatra | Sakshi
Sakshi News home page

వైభవంగా పూరీ రథయాత్ర

Published Mon, Jun 30 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM

వైభవంగా పూరీ  రథయాత్ర

వైభవంగా పూరీ రథయాత్ర

ఊరేగింపులో పాల్గొన్న 10 లక్షల మంది భక్తులు
తొలి దర్శనం చేసుకోని పూరీ శంకరాచార్య  ప్రశాంతంగా సాగిన తొలిరోజు యాత్ర

 
భువనేశ్వర్/పూరీ(ఒడిశా): ఒడిశాలోని పూరీ లో ఏటా నిర్వహించే ప్రపంచ ప్రఖ్యాత శ్రీ జగన్నాథుని రథయాత్ర ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. లక్షలాది మంది భక్తుల ఆధ్యాత్మిక శోభ, కట్టుదిట్టమైన భద్రత మధ్య ఊరేగింపు తొలిరోజు ప్రశాంతంగా సాగింది. దేశ విదేశాలకు చెందిన సుమారు 10 లక్షల మంది భక్తులు రథాలపై ఊరేగుతున్న బలభద్ర, సుభద్ర, శ్రీజగన్నాథుని దర్శనం చేసుకున్నారు. బలభద్ర తాళధ్వజం, సుభద్ర దవుదళ్, శ్రీజగన్నాథుని నందిఘోష్ రథాలు సాయంత్రం సమయానికే గమ్యం చేరాయి. ఉదయం నిర్వహించిన పూజాదుల్లో సుమారు 2 గంటలపాటు జాప్యం చోటుచేసుకుంది. ప్రభుత్వం ఈ ఏడాది భక్తులు రథాలపెకైక్కి దేవతామూర్తులను స్పృశించి దర్శనం చేసుకోవడాన్ని ఆపేయడం, శిష్య బృందం లేకుండా ఒంటరిగానే రథంపైకి ఎక్కి దర్శనం చేసుకోవాలని శ్రీమందిరం అధికారులు పూరీ శంకరాచార్యులకు లేఖ పంపడంతో ఆయన కినుక వహించిన నేపథ్యంలో యాత్ర ఆలస్యంగా మొదలైంది. గోవర్ధనపీఠం శంకరాచార్యులు స్వామి నిశ్చలానంద సరస్వతి రథాలపైకి వెళ్లి దేవుళ్లను దర్శించుకుని రథ ప్రదక్షిణ చేసేందుకు నిరాకరించారు. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జుయెల్ ఓరాం శంకరాచార్యకు నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శ్రీమందిరం గర్భగుడి నుంచి వరుస క్రమంలో సుదర్శనుడు, బలభద్రుడు, శ్రీజగన్నాథుని విగ్రహాల్ని సింహద్వారం గుండా రథాలపైకి తరలించారు.

రథాలపై దేవతామూర్తుల్ని అధిష్టించాక శంకరాచార్యులు తొలి దర్శనం చేసుకోవడం దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆచారం. దేవుళ్ల తరలింపు తర్వాత రథాలను లాగడం ప్రారంభించారు. రాష్ట్ర గవర్నర్ డాక్టర్ ఎస్.సి. జమీర్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రులు జుయెల్ ఓరాం, ధర్మేంద్ర ప్రధాన్ వంటి ప్రముఖులు యాత్రను ప్రత్యక్షంగా తిలకించారు. ముఖ్యమంత్రి నవీన్, కేంద్ర మంత్రి జుయెల్ ఓరాం జగన్నాథుని నందిఘోష్ రథాన్ని లాగారు. రథాలు గుండిచా మందిరానికి చేరే సమయానికి చీకటి పడడంతో మూల విరాట్లను రథాలపై ఉంచి మిగిలిన సేవలు నిర్వహించారు. సోమవారం ఉదయం పూజలను రథాలపైనే పూర్తి చేసి మూల విరాట్‌లను గుండిచా మందిరంలోని అడపా మండపంపైకి తరలించనున్నారు. యాత్ర సందర్భంగా అవాంఛనీయ ఘటనలను నివారించేందుకు 7 వేల మంది పోలీసులను ప్రభుత్వం మోహరించింది. సీసీటీవీలు, నిఘా కెమెరాలను ఏర్పాటు చేసింది. కాగా, రథయాత్రను పురస్కరించుకొని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు.

రథయాత్రలో మోడీ కటౌట్ల ప్రదర్శన

 అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఏటా కన్నుల పండువగా జరిగే జగన్నాథ రథయాత్రలో సీఎం హోదాలో పాల్గొనే నరేంద్ర మోడీ ఈసారి ప్రధాని కావడం వల్ల పాల్గొనలేకపోయినా ఆయన అభిమానులు మాత్రం ఆ లోటును తీర్చుకున్నారు. మోడీ కటౌట్లను రథయాత్రలో ప్రదర్శించారు. ఓ వ్యక్తికి మోడీ మాస్కును ధరింపజేసి మోడీ తరహాలో హావభావాలను ప్రదర్శింపజేశారు. దీంతో ఈ యాత్రను వీక్షించేందుకు వచ్చిన ప్రజలంతా మోడీ...మోడీ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో మోడీ అత్యధికంగా 12 సార్లు పహింద్ విధి (రథమా ర్గాన్ని బంగారు చీపురుతో శుభ్రపరచడం) నిర్వహించారు.
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement