
సాక్షి, న్యూఢిల్లీ: ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ) ఉప వర్గీకరణ కమిషన్ చైర్‌పర్సన్‌గా కేంద్రం తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని ఢిల్లీ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణి మంగళవారం పేర్కొన్నారు.
ఓబీసీ ఉప వర్గీకరణ కోసం జస్టిస్ రోహిణి నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిషన్‌ను సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నియమించారు. అసలు ఓబీసీ కులాలను ఉప వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉందా?లేదా?...అన్ని వర్గాల వారికి రిజర్వేషన్ ఫలాలు సక్రమంగా అందుతున్నాయా?లేదా? అన్న అంశాలపై తమ కమిషన్ అధ్యయనం చేస్తుందని రోహిణి పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జయంతి రోజున కమిషన్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం.
సామాజిక న్యాయ, సాధికారత విభాగం సంయుక్త కార్యదర్శి ఈ కమిషన్‌కు కార్యదర్శిగా ఉంటారు. డా.జేకే బజాజ్ కమిటీ సభ్యుడిగా, ఆంత్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్, రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఎక్స్–అఫీషియో సభ్యులుగా ఉంటారు. కమిటీ చైర్‌పర్సన్‌గా జస్టిస్ రోహిణి బాధ్యతలు స్వీకరించిన 12 వారాల్లోపు కమిషన్ తన నివేదికను రాష్ట్రపతికి సమర్పించాల్సి ఉంటుంది. మరో మూడు రోజుల్లో కమిషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపడతానని రోహిణి వెల్లడించారు.