14 గిన్నీస్ రికార్డుల పోలీస్.. అమ్మకు గుడి
మదురై: అతడు ఓ హెడ్ కానిస్టేబుల్. ఓ పక్క విధులు నిర్వర్తిస్తూనే మరోపక్క, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను దేవతా ప్రాయంగా కొలిచాడు. ఆమె అంటే అతడికి ఎక్కడ లేనంత గౌరవం, భక్తి. ఆమె కోసం ఏం చేసేందుకైనా వెనుకడుగేయడు. అందుకే ఆమె అనారోగ్యం పాలయిందని తెలిసిన వెంటనే తన ఉద్యోగాన్ని సైతం పక్కకు పెట్టి ఆమె కోలుకోవాలని కాశీ విశ్వేశ్వరుడి వద్దకు వెళ్లాడు. కానీ, అతడి పూజలు ఫలించలేదు. గుండెపోటు రూపంలో ఆమెను మృత్యువు కబళించింది.
ఈ బాధలోంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ఆ హెడ్ కానిస్టేబుల్ కనిపించకుండాపోయిన తన అమ్మ (జయలలిత) రూపాన్ని తన కళ్లముందే ఉంచుకోవాలనుకున్నాడు. ఆమెకు ఏకంగా ఆలయం నిర్మించేందుకు మరో 20 ఏళ్ల సర్వీసు ఉండగానే ఉద్యోగానికి రాజీనామా చేసి ఇప్పుడా పనికి దిగాడు. ఈ కార్యక్రమానికి అతడి కుటుంబ సభ్యులు కూడా దన్నుగా నిలవడం మరో విశేషం. ఇతడి పేరిట 14 గిన్నీస్ రికార్డులు కూడా ఉన్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆర్ వేల్మురుగున్(45) అనే వ్యక్తి తేని జిల్లాలో ఓడపట్టి అనే ప్రాంతంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అతడు ఓ కానిస్టేబుల్‌గానే కనిపించినప్పటికీ ఎప్పుడంటే అప్పుడు పలుమార్లు జయలలితను కలుసుకున్నాడు. జయలలిత రాజకీయ గురువైన ఎంజీఆర్‌కు రామవరంలో ఉన్న ఇంటికి వేల్మురుగన్ తండ్రి సెక్యూరిటీగా ఉన్నాడు. దీంతో ఎలాగైనా తాను ఓ పోలీసు అవ్వడం ద్వారా అమ్మవద్ద పనిచేసే అవకాశం పొందవొచ్చని కలలుగన్నాడు. అనుకున్నట్లే పోలీసు ఉద్యోగం రావడం, జయలలిత ఇంటి వద్ద కూడా 1999 నుంచి 2002 వరకు సెక్యూరిటీ బాధ్యతలు నిర్వర్తించడం చేశాడు. ఆ సమయంలో ఆమె చిరునవ్వును ప్రతిరోజు చూసి మురిసిపోయేవాడట.
కన్నతల్లికి సేవ చేస్తున్నట్లుగా భావించేవాడట. ‘జయలలిత నాకు కాలేజీ రోజుల్లో నుంచి ఆరాధ్య దైవం. ఆమె ఇంటి వద్ద సెక్యూరిటీ పనిచేసినప్పుడు నా కల నేరవేరింది. ప్రతి రోజు ఎంతో ఆతృతగా ఆమె దర్శనం కోసం చూస్తూ మురిసిపోయేవాడిని. అమ్మకు ఆరోగ్యం బాగోలేదని, ఆస్పత్రికి తీసుకెళ్లారని తెలియగానే కాశీకి ప్రత్యేక ప్రార్థనల కోసం వెళ్లాను. కానీ, దేవుడు నా ప్రార్ధనలకు సమాధానం ఇవ్వలేదు. తిరిగి నేను సోమవారం చెన్నై వచ్చాను.
ఆ రోజు మా అమ్మ చనిపోయింది. ఏఐఏడీఎంకే భవిష్యత్తు గురించి నాకు ఎలాంటి చింత లేదు. నావరకు ఏఐఏడీంకే అంటే అమ్మమాత్రమే. ఆమెకు నేను ఆలయం నిర్మించుకుంటాను’ అని వేల్మురుగన్ చెప్పాడు. మరో విశేషమేమిటంటే ఇతడి పేరిట దాదాపు 14 గిన్నీస్ రికార్డులు ఉన్నాయి. కొన్ని అవార్డుల ద్వారా వచ్చిన డబ్బును అతడు తమిళనాడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు అందించాడు. జయలలిత పుట్టిన రోజు ఫిబ్రవరి 24న ఈ ఆలయాన్ని పన్నీర్ సెల్వం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.