ఎయిమ్స్ ‘ఎమర్జెన్సీ’ని మెరుగుపరచాలి
న్యూఢిల్లీ: అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో అత్యవసర విభాగం పనితీరును మరింత మెరుగుపరచాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. రోగులకు నిత్యం సేవలు అందించేందుకు ఇక్కడ పూర్తి కాలం పని చేసే రెసిడెంట్ డాక్టర్లు, నర్సులను నియమించాలని సూచిం చారు. ఎయిమ్స్ యాజమాన్యం, వైద్యులు, నర్సులనుద్దేశించి మంత్రి గురువారం ప్రసంగించారు. వయోవృద్ధులకే అన్ని చెకప్‌లకు ఒకే చోట రిజిస్ట్రేషన్ ఉండేలా చూడాలని చెప్పారు. రక్త పరీక్ష, సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ వంటి పరీక్షలు ఒకేసారి నిర్వహిం చాలని సూచించారు.
ఔట్ పేషెంట్ విభాగంలో కూర్చున్న పలువురు రోగులతో మంత్రి మాట్లాడా రు. డాక్టర్లను కలవడానికి ముందు రోగులు ఎంత సమయం వేచి చూడాల్సి వస్తుందో ఆయన తెలుసుకున్నారు. నిర్దేశించిన రోజున అపాయింట్‌మెంట్ దొరకని పక్షంలో మరుసటి రోజుకు అపాయింట్‌మెంట్ మార్చినప్పుడు వేచి చూసే సమయాన్ని పూర్తిగా తగ్గించాలని సూచించారు. ఈ మార్పు వల్ల రోగులు, వారి బంధువులపై ఒత్తిడి తగ్గుతుందని అన్నారు. రోగులతో సున్నితంగా, ప్రేమగా వ్యవహరించాలని వర్దన్ డాక్టర్లకు, నర్సులకు ఉద్బోధించారు. ఎయిమ్స్‌లో పచ్చదనాన్ని పరిశీలించేందుకు ఆయన ఈ ఆస్పత్రిని సందర్శించారు.