హరిత ఆస్పత్రిగా ఎయిమ్స్ | All AIIMS to be made 'green hospitals' says Harsh Vardhan | Sakshi
Sakshi News home page

హరిత ఆస్పత్రిగా ఎయిమ్స్

Published Fri, Jun 6 2014 12:49 AM | Last Updated on Thu, Aug 16 2018 4:04 PM

All AIIMS to be made 'green hospitals' says Harsh Vardhan

 న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను హరిత ఆస్పత్రిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న సంప్రదాయ ఇంధన వినియోగం నుంచి ఎయిమ్స్‌ను దూరం చేస్తామని అన్నారు. వాతావరణ మార్పులపై పోరాడాలని తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, అందులో భాగంగానే ‘గ్రీన్ ఎయిమ్స్’కు ప్రణాళిక రూపొందిస్తామని వర్ధన్ చెప్పారు. ఆరోగ్య సంరక్షణ సంస్థలు ఇంధన వినియోగాన్ని తగ్గించుకొని సౌరశక్తి, ఇతర సహజ వనరులపై ఆధారపడేందుకు ప్రయత్నించాలని సూచించారు. పరివర్తన చెందిన ఎయిమ్స్‌లో నీటి సంరక్షణ వ్యవస్థ, మురుగు నీటి శుద్ధీకరణ వ్యవస్థలుంటాయని మంత్రి పేర్కొన్నారు. ఇంధన వినియోగంపై తరచుగా తనిఖీలుండాలని, ఎయిమ్స్ ఆవరణలోని భవనాలను మరింత ఇంధన సామర్థ్యం గలవిగా రూపొందించేందుకు దశల వారీగా పునరుద్ధరణ ప్రణాళికను రూపొందించాలని వర్ధన్ సూచించారు.
 
 ఆస్పత్రిలో ఉత్పత్తి అయ్యే మొత్తం వ్యర్థ పదార్థాలను తగ్గించేందుకు లేదా పునర్వినియోగించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. రోగులకు హాని చేయకుండా నివారించేందుకు కాలుష్యకారకమైన ధూళి కణాలను ఆకర్షించే చెట్లను ఆస్పత్రి చుట్టూ నాటాలని మంత్రి సూచించారు. ఇంధన పొదుపులో ప్రయత్నాలకు గాను అనేక భవనాలు అవార్డులు పొందాయని, కానీ ఆ జాబితాలో ఆస్పత్రుల పేర్లు ఎప్పుడూ కానరాలేదని హర్షవర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి అవార్డులు పొందేందుకు ఆస్పత్రులు ఎందుకు ప్రయత్నించకూడదని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు, సమాజ ఆరోగ్యానికి ఆస్పత్రులు బ్రాండ్ అంబాసిడర్లుగా రూపొందాలని పేర్కొన్నారు.
 
 పభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజల్లో నాటుకున్న అభిప్రాయాన్ని తొలగించాలని చెప్పారు. కొన్ని రోగాల విషయంలో ఆరోగ్య సంస్థల వద్ద ఉన్న అసమగ్ర గణాంకాల పట్ల మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు భారీగా వలసలు పోవడం వల్ల, సంస్థలు, రాష్ట్రాల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రధానితో చర్చిస్తానని అన్నారు. దేశంలో దురదృష్టవశాత్తు ఆరోగ్య సదుపాయాలు అంతంత మాత్రం గానే ఉన్నాయని వర్ధన్ అంగీకరించారు. మానవుల ఆరోగ్యంపై ప్రభావం చూపే వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు సుశిక్షితులైన ఆరోగ్య కార్యకర్తలను సత్వరమే తయారు చేసుకోవాలని అన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement