
మహిళను ‘చమ్మక్ చల్లో’ అనడం నేరమే
షారూక్ ఖాన్ దుమ్మురేపిన చిత్రాల్లో ఒకటైన రా వన్ సినిమాలో చమ్మక్ చలో పాట అందరికీ సుపరిచితమే. ఈ పాట ఫుల్‌గా ఫేమస్ కూడా అయింది.
సాక్షి, థానే: షారూక్ ఖాన్ సినిమా ‘రా.వన్’లో సూపర్ హిట్ పాట ‘చమ్మక్ చల్లో..’ గుర్తుందికదా! అయితే ‘చమ్మక్ చల్లో..’ అనే పదంతో ఓ మహిళను పోల్చడం చట్టరీత్యా నేరమని, అక్రమమని థానే కోర్టు అనూహ్య తీర్పునిచ్చింది.
ఈ పదంతో మహిళల వినయాన్ని అవమానపరిచినట్టేనని పేర్కొన్న కోర్టు.. ఒక మహిళను ‘చమ్మక్ చల్లో..’ అన్న నేరానికిగానూ ఓ వ్యక్తికి సాధారణ జైలు శిక్ష, ఒక రూపాయి జరిమానా విధించింది.
అసలేం జరిగింది? 2009 జనవరి 9న.. థానేకు చెందిన ఓ మహిళ మార్నింగ్ వాక్ నుంచి తిరిగొచ్చే సరికి ఇంటి మెట్ల వద్ద చెత్త డబ్బా కనిపించింది. ఆ చెత్త డబ్బాను అక్కడ ఎవరు పెట్టారనే విషయమై ఓ వ్యక్తితో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి.. మహిళను ‘చమ్మక్ చల్లో..’ అని అన్నాడు. హిందీలో ఈ పదానికి ‘హాట్ సెక్సీ గర్ల్’ అని అర్థం వస్తుంది. దీన్ని అవమానకరపు కామెంట్‌గా గుర్తించిన సదరు మహిళ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.
''ఆంగ్లంలో ఇలాంటి పదమేమీ లేదు. కానీ హిందీలో ఈ పదం ఉంది. సాధారణంగా ఈ పదాన్ని మహిళలను అవమానపరచడానికి వాడతారు. ప్రశంసించే పదం ఇది కాదు. చమ్మక్ చలో అంటే ఏ మహిళకైనా కోపం, చిరాకు వస్తుంది'' అని మెజిస్ట్రేట్ తన తీర్పులో పేర్కొన్నారు.