
న్యూఢిల్లీ: కరోనా బాధితులకు చికిత్స అందించే విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ సవరించిన ‘క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్స్ ఫర్ కోవిడ్–19’ను శనివారం విడుదల చేసింది. యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్‌ను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. అలాగే కరోనా ప్రాథమిక దశలోనే ఉంటే యాంటీ మలేరియల్ డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు వాడుకోవచ్చని తెలియజేసింది. తీవ్రత అధికంగా ఉన్న కేసుల్లో ఈ మాత్రలు వాడకపోవడమే మంచిదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఈ విషయంలో గతంలో జారీ చేసిన ప్రోటోకాల్‌లోని అంశాలను కేంద్ర ఆరోగ్యశాఖ తొలగించింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న కేసుల్లో హైడ్రాక్సీక్లోరోక్విన్‌తోపాటు అజిత్రోమైసిన్ ఇవ్వొచ్చని గతంలో సూచించిన సంగతి తెలిసిందే.
వాసన, రుచి గ్రహణ శక్తిని కోల్పోవడం కరోనా లక్షణాలే
దగ్గు, జ్వరం, అలసట, డయేరియా, గొంతు నొప్పి, శ్వాస పీల్చడంలో ఇబ్బందులతోపాటు వాసన, రుచిని గ్రహించే శక్తిని కోల్పోవడం కూడా కరోనా వైరస్ లక్షణాలేనని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. సవరించిన క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్‌లో ఈ అంశాన్ని చేర్చింది.