ఈ ఖాతాల నిర్వహణ ఖర్చు ఎంతంటే.?
సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ఏటా కోట్లు కుమ్మరిస్తున్నాయి. సోషల్ మీడియా అకౌంట్ల నిర్వహణను పలు మంత్రిత్వ శాఖలు ప్రయివేట్ సంస్థలు, కన్సల్టింగ్ కంపెనీలకు అప్పగిస్తూ రూ కోట్లు చెల్లిస్తున్నాయి. నరేంద్ర మోదీ సర్కార్ అన్ని మంత్రిత్వ శాఖలు నిరంతరం ప్రజలతో టచ్‌లో ఉండాలని చెబుతుండటంతో ఆయా మంత్రిత్వ శాఖలు విధిగా ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలను నిర్వహిస్తున్నాయి. ఒక్కో మంత్రిత్వ శాఖ ఈ ఖాతాల నిర్వహణకు ఏటా కోటి నుంచి 3 కోట్ల వరకూ వెచ్చిస్తున్నాయి.
సమాచార హక్కు చట్టం కింద వెలుగు చూసిన వివరాల ప్రకారం 56 కేంద్ర మంత్రిత్వ శాఖలు సోషల్ మీడియా ఖాతాలను కలిగిఉన్నాయి. పట్టణ వ్యవహారాలు, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ... క్వాంటమ్ అనే సంస్థకు రూ 7 కోట్లతో మూడేళ్లకు కాంట్రాక్ట్‌ను అప్పగించింది. సమాచార ప్రసార శాఖ ప్రభుత్వ రంగ బీఈసీఐఎల్‌తో రూ 2.92 కోట్లకు సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ కోసం ఒప్పందం కుదుర్చుకుంది.
ఇక ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సంహిత మీడియా నెట్‌వర్క్‌కు కాంట్రాక్ట్ అప్పగించింది. ఎంత మొత్తానికి ఒప్పందం చేసుకున్నారనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. పర్యాటక మంత్రిత్వ శాఖ రూ 1.04 కోట్లతో స్టార్క్ కమ్యూనికేషన్స్‌ను నియమించింది. నీతి ఆయోగ్ యాప్ డిజిటల్‌కు రూ 96 లక్షలకు సోషల్ మీడియా నిర్వహణ కాంట్రాక్టును అప్పగించింది. మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ అయిదుగురు ప్రయివేట్ కన్సల్టెంట్లను నియమించుకుంది.