‘‘జియో సిమ్ యాడ్ నుంచి షారుఖ్ ఖాన్‌ను తొలగించాను. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?’’... ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ ట్విటర్లో తన ‘ఫాలోవర్ల’ను సలహాలు అడిగారు. ఇందుకు వారి నుంచి స్పందన కూడా బాగానే వచ్చింది. పదివేల సార్లు ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. 50 వేలకు పైగా లైకులు కొట్టారు. అంతేకాదు బాలీవుడ్ ఖాన్‌లకు సరైన రీతిలో బుద్ధి చెప్పారంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. వీరిలో ప్రముఖ జర్నలిస్టు ‘అర్నబ్ గోస్వామి’, ప్రఖ్యాత గాయకుడు ‘సోనూ నిగమ్’ కూడా ఉండటం విశేషం. అర్నబ్ అయితే ఓ అడుగు ముందుకేసి.. ‘జియో సిమ్ యాడ్‌లో షారుఖ్‌ను తొలగించి ఆ స్థానంలో అక్షయ్ కుమార్‌ను తీసుకున్నారు. ఈ ఖాన్‌లను బాయ్‌కాట్ చేయాల్సిందే’ అని హ్యాష్‌ట్యాగ్ కూడా జోడించారు.(ఫేక్ ట్వీట్‌కు లైక్: అభాసుపాలైన కాంగ్రెస్ నేత)
కర్టెసీ: ఆల్ట్‌న్యూస్
అదేంటి..?! ముకేశ్ అంబానీకి అసలు ట్విటర్ ఖాతానే లేదు కదా! అవును.. నిజమే ఆయనకు ట్విటర్ అకౌంట్ లేదు. మరి ఇదంతా ఏంటి అని అడిగితే ఫేక్ రాయుళ్ల అద్భుత ‘ప్రతిభ’కు నిదర్శనం. మసిపూసి మారేడు కాయ చేసే వారి అసమాన తెలివితేటలకు ఓ ఉదాహరణ. అన్నట్లు ఈ ట్వీట్ ఎంత అబద్ధమో.. అందుకు ప్రముఖుల నుంచి వచ్చిన రెస్పాన్స్ కూడా అంతే అబద్దం. అంటే ముకేశ్ అంబానీతో పాటు అర్నబ్ గోస్వామి, సోనూల అకౌంట్లు కూడా నకిలీవే. సోషల్ మీడియా ప్రమాణాలపై కాస్త అవగాహన ఉన్నవాళ్లెవరికైనా ఇది అర్థమవుతుంది. ఎందుకంటే.. ముకేశ్ అంబానీ పేరిట ఇలా ఇంగ్లీష్, హిందీ భాషల్లో ట్వీట్లు చేయడానికై క్రియేట్ చేసిన రియల్ ముకేశ్ అంబానీ, ముకేశ్ అంబానీ అకౌంట్లకు టిక్ మార్కు లేదు. (చైనా సైనిక మరణాలపై అంతా గందరగోళం)
ఇక ఈ నకిలీ అకౌంట్ల యూజర్ల పేర్లు కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఉదాహరణకు.. ముకేశ్‌ను ప్రశంసించిన అర్నబ్ పేరిట ఉన్న ఖాతా.. ఆ తర్వాత కంగనా రనౌత్‌గా పేరుకు మారిపోయింది. వెంటనే మరో నిరాధార, అసత్య వార్త ప్రచారానికి సిద్ధమైపోయింది. రాందేవ్ బాబా పతంజలి కరోనా నివారణకు తయారు చేసిన ‘కరోనిల్’ మందుకు భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది అనేది దాని సారాంశం. అంతేగాక షారుఖ్‌ను తమ యాడ్ నుంచి తొలగించినట్లు జియో నుంచి తనకు సమాచారం అందింది అనేది మరో నకిలి వార్తను కూడా కంగన పేరిట ప్రచారం చేసింది. నిజానికి ముకేశ్‌తో పాటు అర్నబ్ గోస్వామి, కంగన రనౌత్‌కు అధికారిక ట్విటర్ ఖాతాలు లేనేలేవు. (@KanganaTeam పేరిట కంగన బృందం ఆమె ట్విటర్ అకౌంట్‌ను హ్యాండిల్ చేస్తోంది)(ఆ రెండింటిపై హోం శాఖ అలర్ట్)
అయిననప్పటికీ నకిలీగాళ్లు అసత్యాలను ప్రచారం చేయడంలో విజయం సాధించారు. భారీగా ఫాలోవర్లను పెంచుకోవడంలో సఫలీకృతులయ్యారు. ముఖ్యంగా ‘జాతీయవాదాన్ని’ రెచ్చగొడుతూ యాంటీ నేషనలిస్టులు అంటూ కొందరిపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. అందుకే బాగా చదువుకుని, పెద్ద పెద్ద సంస్థల్లో ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వాళ్లలో కొంతమంది కూడా వీరి వలకు చిక్కుతున్నారు. వేలల్లో లైకులు కొడుతూ ‘దేశభక్తి’ చాటుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్‌లో ఈ స్క్రీన్‌షాట్లను షేర్ చేస్తూ అందరినీ తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారు. గతవారం రోజులుగా తప్పుడు వార్తలతో ప్రచారం పొంది.. ఫేమస్ అయిన ట్విటర్ ఖాతాల్లో మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే..! పలు ఫ్యాక్ట్‌చెక్ సంస్థ ఈ విషయాన్ని వెలికితీశాయి. ఇక ఇట్లాంటి ఫేక్ న్యూస్‌లు, వివిధ వర్గాల మధ్య చిచ్చుపెట్టే అసత్య కథనాలకు కొదవే లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. ఈ ఫేక్‌న్యూస్ బురద వల్ల మనం ఒక్కోసారి చట్టపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త!(కరోనాపై తప్పుడు వార్తలు, భారతీయ టెకీకి షాక్)
Comments
Please login to add a commentAdd a comment