కాంగ్రెస్ పార్టీ, శివసేన అంతు చూస్తానని ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేత నారయణ్ రాణే అన్నారు.
ముంబయి : కాంగ్రెస్ పార్టీ, శివసేన అంతు చూస్తానని ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేత నారయణ్ రాణే అన్నారు. ఇది వరకు శివసేన పార్టీలో సైతం ఉన్న ఆయన గురువారం కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తనను తీవ్రంగా అవమానించిందని, అశోక్ చవాన్ దుర్యోదనుడిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి టాటా చెప్పిన ఆయన త్వరలోనే బీజేపీలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఆయన ఇద్దరు కుమారులను కూడా బీజేపీలోకి చేర్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఆయన బీజేపీలోకి అడుగుపెట్టడం శివసేనకు ఏ మాత్రం ఇష్టం లేనట్లు తెలుస్తోంది. నారాయణ్ రాణే కాంగ్రెస్ పార్టీని వీడినట్లు ప్రకటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నేను నా రాజీనామా లేఖను సోనియాగాంధీకి మధ్యాహ్నం 2.30గంటల ప్రాంతంలో పంపించాను. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. అందుకే నేను పార్టీని వీడుతున్నాను. నేను కాంగ్రెస్ పార్టీని, శివసేనను అంతం చేస్తాను’ అని చెప్పారు.