సదస్సులో మాట్లాడుతున్న ప్రకాశ్ మయ్యా. చిత్రంలో సిమర్‌ప్రీత్ సింగ్
ఈ రోజుల్లో ఇళ్లల్లో.. షాపింగ్‌మాల్స్‌లో.. రెస్టారెంట్లలో.. ఎక్కడకు వెళ్లినా ఏసీలు తప్పనిసరి! చల్లదనం మాటెలా ఉన్నా.. వీటిల్లో వాడే రసాయనాల పుణ్యమా అని.. పర్యావరణానికి కలుగుతున్న నష్టం ఇంతింత కాదు! మరి తరుణోపాయం..? కార్బన్ డయాక్సైడ్ అంటోంది ఐఐటీ మద్రాస్!
పర్యావరణ కాలుష్యానికి విరుగుడుగా కార్బన్ డయాక్సైడ్ వాడకం ఎలాగో తెలుసుకునే ముందు కొన్ని విషయాలను అర్థం చేసుకోవా ల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం రిఫ్రిజరేటర్లు, భారీస్థాయి ఏసీల్లోనూ హైడ్రోఫ్లోరో కార్బన్స్ (హెచ్‌ఎఫ్‌సీ) అనే శీతలీకరణ రసాయనాలను వాడుతున్నాం. ఓజోన్ పొరకు నష్టం కలుగుతోందన్న కారణంతో ఒకప్పుడు వాడిన క్లోరోఫ్లోరో కార్బన్స్ స్థానంలో ఈ కొత్త రసాయనాలు వచ్చాయి.
మొదట్లో అంతా బాగుందని అనుకున్నా.. ఈ హెచ్‌ఎఫ్‌సీలు కార్బన్ డయాక్సైడ్ కంటే కొన్ని వందల, వేల రెట్లు ఎక్కువ ప్రమాదకరమని పరిశోధనల ద్వారా స్పష్టమైంది. వాతావరణంలోకి చేరే కార్బన్ డయాక్సైడ్ సహజసిద్ధంగా నాశనమయ్యేందుకు వంద సంవత్సరాలు పడుతుందని అనుకుంటే.. హెచ్‌ఎఫ్‌సీలు కొన్ని వేల సంవత్సరాలు అలాగే ఉండిపోతాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. 2100 నాటికి ఒక్క హెచ్‌ఎఫ్‌సీల కారణంగానే భూమి ఉష్ణోగ్రత 0.5 డిగ్రీ సెల్సియస్ వరకూ పెరుగుతుందని అంచనా.
సమస్య ఇంత తీవ్రంగా ఉన్న కారణంగానే ఈ హెచ్‌ఎఫ్‌సీల వాడకాన్ని 2050 నాటికల్లా కనీసం 90 శాతం తగ్గించాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. ఇందుకు తగ్గట్టుగానే హెచ్‌ఎఫ్‌సీలకు ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసేందుకు ప్రయత్నాలూ ఊపందుకున్నాయి. ఇప్పటికే కొన్ని రసాయనాలను ఉత్పత్తి చేసినప్పటికీ లోటుపాట్లు ఎక్కువగా ఉన్న కారణంగా అవేవీ విస్తృతంగా వాడకంలోకి రాలేదు.
గతంలో వాడిందే మళ్లీ....
రిఫ్రిజిరేటర్లలో శీతలీకరణ కోసం ఒకప్పుడు కార్బన్ డయాక్సైడ్‌నే వాడేవారు. అయితే అధిక ఒత్తిడికి గురిచేసి వాడాల్సి ఉండటం.. మరమ్మతుల సమయంలో ప్రమాదాలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో.. 19వ శతాబ్దపు చివరినాటికి కృత్రిమంగా తయారు చేసిన క్లోరో ఫ్లోరో కార్బన్స్ వాడకం మొదలైంది. ఈ నేపథ్యంలో ఐఐటీ మద్రాస్‌లోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం శాస్త్రవేత్త ప్రకాశ్ మయ్యా కార్బన్ డయాక్సైడ్ రిఫ్రిజరేషన్‌పై ప్రయోగాలు మొదలుపెట్టారు. నార్వే సంస్థతో కలసి చేపట్టిన ఈ ప్రయోగాల ఫలితంగా ఓ నమూనా రిఫ్రిజరేటర్ సిద్ధమైంది.
రెండు ప్రయోజనాలు...
కార్బన్ డయాక్సైడ్ శీతలీకరణ రసాయనంగా వాడే ఏసీల వల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయి. భవనాల్లోపలి భాగాలకు చల్లదనం అందించడం ఒక ప్రయోజనమైతే.. ఈ క్రమంలో వెలువడే వేడిని కూడా ఒడిసిపట్టుకోగలగడం రెండోది. ఆసుపత్రులతోపాటు కొన్ని ఇతర చోట్ల ఒకపక్క చల్లదనం పొందుతూనే ఇంకోపక్క వేడినీటిని సిద్ధం చేసుకోవచ్చునన్నమాట.
థర్మల్ పవర్ స్టేషన్లు మొదలుకొని చాలా ఫ్యాక్టరీల ద్వారా వెలువడే కార్బన్ డయాౖక్సైడ్‌ను అక్కడికక్కడే సేకరించి శీతలీకరణ కోసం వాడుకోవచ్చు కాబట్టి ఈ కొత్త ఏసీలకయ్యే ఖర్చు చాలా తక్కువగానే ఉంటుందని అన్నారు. స్పెయిన్‌లోని వెలంసియాలో ఇటీవల జరిగిన ఒక సదస్సులో ఈ కొత్త టెక్నాలజీకి మంచి ఆదరణ లభించింది. ఆ సదస్సులో పాల్గొన్న ప్రకాశ్ మయ్యా మాట్లాడుతూ ‘‘పర్యావరణ అనుకూల శీతలీకరణ రసాయనాల తయారీకి భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహం కల్పిస్తోంది. సూపర్ మార్కెట్లు, ఆసుపత్రుల్లోనూ తక్కువ ఖర్చుతో చల్లదనాన్ని కల్పించేందుకు అనువైన టెక్నాలజీ ఇది’’అని అన్నారు.
విద్యుత్ వినియోగంలో 20 శాతం తగ్గుదల
సాధారణ ఏసీలతో పోలిస్తే 20 శాతం తక్కువ విద్యుత్తును వాడుకుంటూనే ఈ నమూనా ఏసీ ఎక్కువ చల్లదనాన్ని కూడా అందిస్తుందని, ఏడాదిగా తాము దీన్ని విజయవంతంగా నడుపుతున్నామని ప్రకాశ్ మయ్యా బృందంలోని శాస్త్రవేత్త సిమర్‌ప్రీత్ సింగ్ ‘సాక్షి’కి తెలిపారు. యూరప్‌లోనూ కార్బన్ డయాక్సైడ్ సాయంతో పనిచేసే ఏసీలు ఉన్నప్పటికీ అధిక ఉష్ణోగ్రత ఉన్న వాతావరణాల్లో అవి పనిచేయవని చెప్పారు.
తాము తయారు చేసిన నమూనా మాత్రం 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న పరిస్థితుల్లోనూ చక్కగా పనిచేసిందని.. పరిసరాలను చల్లబరిచిందని వివరించారు. అయితే ప్రస్తుతానికి పది టన్నులు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యమున్న ఏసీలతోనే వాడాల్సి ఉంటుందని.. వ్యక్తిగత స్థాయిలో తయారీకి మరికొంత కాలం పడుతుందని వివరించారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment