లాక్‌డౌన్‌తో సొంతూళ్లకు వెళ్లేందుకు ఘజియాబాద్‌లోని కౌశాంబి బస్‌స్టేషన్‌కు వందలాదిగా వచ్చిన వలస కుటుంబాలు
న్యూఢిల్లీ/భోపాల్/కోచి: భారత్‌లో కరోనా మరణ మృదంగం మోగుతూనే ఉంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యికి చేరువవుతోంది. శనివారం ఒక్క రోజే దేశంలో 179 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేవలం ఒక్కరోజులో ఇన్ని కేసులు వెలుగు చూడడం ఇదే ప్రథమం. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 918కు చేరింది. కరోనాతో శనివారం మహారాష్ట్రలో ఒకరు, మధ్యప్రదేశ్‌లో ఒకరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 19కి ఎగబాకింది. దేశంలో కరోనా వ్యాప్తి మూడో దశలోకి ప్రవేశించనుందన్న అనధికార వార్తలు ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగవంతమైందనడానికి సూచిక కాదని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తేల్చిచెప్పింది. (వెల్లువలా వలసలు)
లాక్‌డౌన్ సమయంలో ఇళ్లలోనే ఉండాలంటూ కరోనా వైరస్‌ను పోలిన హెల్మెట్ ధరించి వాహనదారులను హెచ్చరిస్తున్న చెన్నై పోలీస్ అధికారి
అన్ని రాష్ట్రాల్లో కరోనా హాస్పిటళ్లు
కరోనా భరతం పట్టడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కరోనా ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ప్రకటించారు. ఇప్పటికే 17 రాష్ట్రాలు దీనిపై కార్యాచరణ ప్రారంభించామని పేర్కొన్నారు. కరోనా ఆసుపత్రుల ఏర్పాటుపై అన్ని రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని వివరించారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెప్పారు. వైరస్ నియంత్రణకు రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు. లాక్‌డౌన్, సామాజిక దూరాన్ని వంద శాతం కచ్చితంగా అమలు చేసేందుకు కలిసికట్టుగా కృషి చేస్తున్నామన్నారు.
నర్సింగ్ సిబ్బందికి ఆన్‌లైన్‌లో శిక్షణ
కరోనా బాధితులకు అందించాల్సిన చికిత్సపై ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్యులకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. వచ్చే 5–7 రోజుల్లో ఎయిమ్స్ వైద్యులతో నర్సింగ్ సిబ్బందికి ఆన్‌లైన్‌లో శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో రోజంతా పనిచేసే టెలీ కన్సల్టేషన్ సెంటర్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ శనివారం ప్రారంభించారని లవ్ అగర్వాల్ వివరించారు. ఈ సెంటర్ ద్వారా ఇతర ఆసుపత్రుల్లోని వైద్యులకు, వైద్య కళాశాలల్లోని సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తామని అన్నారు. కరోనాను నియంత్రించే విషయంలో ఇతర దేశాల కంటే మన దేశం ముందుగానే మేల్కొందని లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు.
918 మందిలో 47 మంది విదేశీయులు
కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. కరోనా మహమ్మారితో ఇప్పటివరకు మహారాష్ట్రలో ఐదుగురు, గుజరాత్‌లో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు, మధ్యప్రదేశ్‌లో ఇద్దరు, తమిళనాడు, బిహార్, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. కేరళలోనూ ఒక వృద్ధుడు కరోనాతో మరణించాడని అక్కడి అధికారులు ప్రకటించారు. కానీ, ఈ మరణాన్ని ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వ గణాంకాల్లో చేర్చలేదు. దేశంలో ఇప్పటివరకు కరోనా ప్రభావానికి గురైన 918 మందిలో 47 మంది విదేశీయులు ఉన్నారు.
అత్యధికంగా మహారాష్ట్రలో 180 కరోనా కేసులు నమోదయ్యాయి. 173 కేసులతో కేరళ రెండో స్థానంలో నిలిచింది. కర్ణాటకలో 55, తెలంగాణలో 48, రాజస్తాన్‌లో 48, గుజరాత్‌లో 48, ఉత్తరప్రదేశ్‌లో 45, ఢిల్లీలో 39, పంజాబ్‌లో 38, హరియాణాలో 33, తమిళనాడులో 38, మధ్యప్రదేశ్‌లో 30, జమ్మూకశ్మీర్‌లో 18, పశ్చిమబెంగాల్‌లో 15, ఆంధ్రప్రదేశ్‌లో 14, లదాఖ్‌లో 13, బిహార్‌లో 9, చండీగఢ్‌లో 7, ఛత్తీస్‌గఢ్‌లో 6, ఉత్తరాఖండ్‌లో 5, హిమాచల్ ప్రదేశ్‌లో 3, ఒడిశాలో 3, గోవాలో 3, పుదుచ్చేరిలో ఒకటి, మిజోరాంలో ఒకటి, మణిపూర్‌లో ఒకటి, అండమాన్ దీవుల్లో 2 కేసులు నమోదయ్యాయి.
కేరళలో తొలి ‘కరోనా’ మరణం
కేరళలో కరోనా వైరస్ బారినపడి ఓ వృద్ధుడు ప్రాణాలు విడిచాడు. రాష్ట్రంలో ఇదే తొలి కరోనా మరణం కావడం గమనార్హం. 69 ఏళ్ల ఈ వ్యక్తి ఎర్నాకుళం మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మార్చి 16న దుబాయి నుంచి వచ్చిన అతడిలో తొలుత న్యుమోనియా లక్షణాలు కనిపించడంతో మార్చి 22న ఎర్నాకుళం మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లోని ఐసోలేషన్ వార్డులో చేర్చారు. అనంతరం కరోనా పాజిటివ్ అని తేలింది. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధితోపాటు అధిక రక్తపోటుతో బాధపడుతున్నాడని అధికార వర్గాలు తెలిపాయి. ఆ వృద్ధుడిని కలిసిన 86 మందిని ఇప్పటికే క్వారంటైన్‌కు తరలించారు.
ఆ పాత్రికేయుడిపై కేసు
మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు హాజరైన జర్నలిస్టుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చి 20న కమల్‌నాథ్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆ జర్నలిస్టు పాల్గొన్నాడు. లండన్‌లో చదువుతున్న ఆయన కుమార్తె భోపాల్‌కు వచ్చింది. ఆమెకూ కరోనా పాజిటివ్ ఉన్నట్లు బయటపడింది. ఆ తర్వాత ఆమె తండ్రి అయిన జర్నలిస్టుకు కూడా కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఆ విషయాన్ని దాచి, విలేకరుల సమావేశానికి హాజరు కావడాన్ని ప్రభుత్వ వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి.
ఆహార పదార్థాలు ఇవ్వండి.. పేదలకు అందజేస్తాం..
బెంగళూరు: లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు దాతలు విరివిగా ముందుకు రావాలని కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ కోరారు. బెంగళూరు పోలీసులు ఉపాధి కోల్పోయిన వారికి ఆహారం అందజేస్తున్నారు.
రూ.9,000 కోట్లివ్వండి
లాక్‌డౌన్ వల్ల ఎదురైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు తమ రాష్ట్రానికి రూ.9 వేల కోట్లు ఇవ్వాలని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రధాని మోదీకి లేఖ రాశారు.
సరిగ్గానే స్పందించాం: కేంద్రం
ఎలాంటి ప్రణాళిక లేకుండానే 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్రకటించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందంటూ వెల్లువెత్తుతున్న విమర్శలను కేంద్రం ఖండించింది. కరోనా తీవ్రతపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరికల కంటే ముందే ప్రభుత్వం అప్రమత్తమైందని, సరిహద్దుల్లో ఆంక్షలను అమల్లోకి తెచ్చిందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రభుత్వ ప్రతిస్పందన సరైన రీతిలోనే ఉందని ఆ ప్రకటనలో వెల్లడించింది.
చాన్నాళ్ల తర్వాత రామాయణ్ సీరియల్ మళ్లీ మొదలవడంతో గువాహటిలో సెల్‌ఫోన్‌లో సీరియల్ చూస్తున్న గువాహటి బాలిక
లండన్‌లోని ఎక్సెల్ కేంద్రాన్ని కరోనా పేషెంట్ల కోసం తాత్కాలిక ఆస్పత్రిగా మార్చేందుకు సాగుతున్న ఏర్పాట్లు
ఘజియాబాద్‌లో సొంతూరు కెళ్లే బస్సు కోసం పరుగు తీస్తున్న వలస కుటుంబాలు
Comments
Please login to add a commentAdd a comment