సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలను చుట్టి వచ్చిన ప్రాణాంతక కరోనా వైరస్ భారత్‌లోనూ కంటిమీదు కునుకులేకుండా చేస్తోంది. ముఖ్యంగా దేశ ఆర్థిక రంగానికి పట్టుకొమ్మలా ఉన్న నగరాలపైనే వైరస్ ప్రభావం ఎక్కువగా చూపడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. వీటిల్లో 50శాతం కేసులు మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోనే నమోదు కావడం ఆందోళనకరం. ఇక ఉత్తర ప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోనూ వైరస్ ఉధృతి భయాందోళనకు గురిచేస్తోంది. ఇక పట్టణాల వారిగా చూస్తే దేశ పారిశ్రామిక, ఆర్థిక కార్యాకలాపాలకు కేంద్రబిందువైన నగరాల్లో కోవిడ్ కలవరపెడుతోంది. (భారత్‌లో లక్ష దాటేసిన కరోనా కేసులు)
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉంది. ఇప్పటి వరకు 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యియి. ఢిల్లీ మహానగరంలో జనసాంధ్రత ఎక్కువగా ఉండటంతో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన మర్కజ్ నిజాముద్దీన్.. హస్తినను అతలాకుతలం చేసింది. దీని కారణంగానే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా పెరిగాయి. ఢిల్లీలోని కరోల్‌బాగ్, అంతర్జాతీయ విమానాశ్రయం, షాలిమార్ బాగ్, ఆజాద్‌పూరి మండీ మార్కట్‌లో జనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వీటి మూలంగానే వైరస్ ఒకరినుంచి మరొకరి సోకినట్లు అక్కడి వైద్యులు చెబుతున్నారు.
ఆర్థిక రాజధాని అతలాకుతలం..
దేశంలో నమోదైన కేసుల్లో ఎక్కువ భాగం మహారాష్ట్రలోనే నమోదు అయ్యాయి. కేంద్ర గణాంకాల ప్రకారం 35,058 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 1,249కి చేరింది. దేశ ఆర్థిక రాజధానిగా కీర్తిగడించిన ముంబై మహానగరంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో ఎక్కువ భాగం, ముంబై, పూణే, ఠాణే, నాసిక్, ఔరంగాబాద్‌లోనే వెలుగుచూశాయి. ఆసియాలోనే అతి పెద్ద మురికివాడల్లో ఒకటైన ధారావిలో కోవిడ్ వ్యాప్తి మరింత తీవ్రంగా ఉంది. ఇప్పటి వరకు అక్కడ 1200 పైగా కేసులు నమోదు కాగా 56 మంది మరణించారు. (కరోనాపై విచారణకు భారత్ ఓకే)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లోనూ కరోనా విస్తరించింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రాల్లో రెండోస్థానంలో ఉంది. పారిశ్రామిక నగరమైన అహ్మాదాబాద్‌లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడం గుజరాత్‌కు శాపంగా మారింది. రాష్ట్ర ఆర్థిక కేంద్రాలైన సూరత్, రాజ్‌కోట్, గాంధీనగర్, బావ్ నగర్‌లో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి.
కోయంబేడు కలకలం..
దేశంలో కరోనా కేసుల వ్యాప్తికి మూలమైన మర్కజ్‌కు ఎక్కువగా నష్టపోయిన రాష్ట్రం తమిళనాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 11,760 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దేశ ఐటీ రంగానికి కీలకంగా మారిన చెన్నైలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. మర్కజ్ ప్రకంపనల నుంచి బయటపడిన తమిళనాడును తాజాగా కోయంబేడు కలవరపెడుతోంది. కోయంబేడు మార్కెట్‌కు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తొలుత తేలింది. ఇప్పడు అదే మార్కెట్ పొరుగు రాష్ట్రాలకు సైతం ఇబ్బందికరంగా మారింది. ఇప్పటి వరకు కోయంబేడు ద్వారా వందల సంఖ్యలో వ్యక్తులకు వైరస్ సోకింది.
ఇక రాజస్తాన్‌లో జోధ్‌పూర్, జైపూర్, ఉదయ్‌పూర్, అజ్మేర్, కోటా వంటి పర్యటక ప్రాంతాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్, ఇండోర్‌లో అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక కారిడార్‌లోనే ఉధృతి ఎక్కువగా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక ఉత్తర ప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి రాష్ట్ర రాజధాని లక్నో, ఆగ్రా, కాన్పూర్, మీరట్, ఆలహాబాద్ వంటి పట్టణాల్లోనే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్ మహానగంలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ప్రస్తుతం నమోదవుతున్న కేసులన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదు అవుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ జిల్లాల్లోనే ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment