సాక్షి, న్యూఢిల్లీ : చైనాలోని వుహాన్ నగరంలో కరోనా వైరస్ ఆవిర్భవించిందన్న వార్తలు తెలిసినప్పటి నుంచి చైనాకు వ్యతిరేకంగా భారత్‌లో నినాదాలు మొదలయ్యాయి. చైనా తయారీ టీవీలు, స్మార్ట్ ఫోన్లను పగులగొడుతున్న భారతీయుల వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రసారం అయ్యాయి. చైనా సైనికుల దాడిలో 20 మంది భారతీయ సైనికులు మరణించారనే వార్త తెల్సినప్పటి నుంచి చైనా పట్ల భారతీయుల వ్యతిరేకత మరింత పెరిగింది. దేశంలో అక్కడక్కడ గత వారం చైనా ఉత్పత్తులు అమ్ముతున్న దుకాణాలపై దాడులు కూడా జరిగాయి.
ఈ పరిణామాలను చూస్తుంటే అబ్బో! దేశంలో చైనా పట్ల వృతిరేకత బాగా పెరిగిందని అనుకుంటాం. చైనాను లేదా చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే విషయంలో మెజారిటీ భారతీయులు ఓ నిశ్చితాభిప్రాయానికి రాలేక పోతున్నారు. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల కంపెనీ తన ‘వన్‌ప్లస్’ స్మార్ట్‌ఫోన్ల సిరీస్‌లో తీసుకొచ్చిన ‘వన్‌ప్లస్ 8 ప్రో’ మోడల్ ఫోన్లను జూన్ 18వ తేదీన అమెజాన్ ద్వారా భారత్‌లో అమ్మకాలు ప్రారంభించగా క్షణాల్లో అమ్ముడు పోయాయి. అయితే ఎంత సంఖ్యలో, ఎన్ని కోట్లకు అమ్ముడు పోయావో చైనా కంపెనీగానీ, అమెజాన్‌గానీ తెలియజేయలేదు. స్టాక్ అయిపోయినందున బుకింగ్ క్లోజ్ చేసినట్లు అమెజాన్ ప్రకటించింది. (వన్‌ప్లస్ సర్ ప్రైజ్, తక్కువ ధరకే లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లు)
షావోమీ, వీవో, రియల్‌మీ లాంటి చైనా కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లు, టీవీలు గత కొన్నేళ్లుగా తెగ అమ్ముడు పోతున్నాయి. చైనా కంపెనీల నుంచి స్మార్ట్ ఫోన్లు, టీవీలు అతి తక్కువ ధరలకు రావడమే కాకుండా నాణ్యత కూడా బాగానే ఉంటుండంతో వాటికి భారత్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంది. దేశంలో ఏటా అమ్ముడుపోతోన్న స్మార్ట్ ఫోన్లలో 76 శాతం ఫోన్లు చైనావేనని సర్వేలు తెలియజేస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన ఓ జాతీయ సర్వేలో ప్రతి పది మందిలో నలుగురు మాత్రమే చైనా ఉత్పత్తులను కొనమని, బహిష్కరిస్తామని చెప్పారు. బహిష్కరిస్తామని చెప్పిన వాళ్లలో కూడా అటు ఇటు ఊగిసలాడే వారు ఉంటారు.
ఎందుకు చైనా ఉత్పత్తులను భారతీయులు బహిష్కరించలేక పోతున్నారని ప్రశ్నించగా, భారతీయులు వస్తువుల మన్నికతోపాటు చౌక ధరలను చూస్తారని హాంకాంగ్‌లో పనిచేస్తోన్న సీనియర్ మార్కెటింగ్ విశ్లేషకులు తరుణ్ పాఠక్ తెలియజేశారు. ఇదే విషయమై ‘రియల్ మీ’ ఇండియా సీఈవో మాధవ్ సేథ్‌ను ప్రశ్నించగా తమ కంపెనీ భారత్‌లో 7,500 మందికి ఉద్యోగాలు కల్పించిందని, ఈ సంఖ్యను త్వరలోనే పదివేలకు విస్తరిస్తున్నామని, అలాంటప్పుడు తమ ఉత్పత్తులను భారతీయులు ఎందుకు వ్యతిరేకిస్తారని ఆయన అన్నారు. చైనాకు చెందిన చాలా కంపెనీలు ఇప్పుడు భారత్‌లో లక్షలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్నందునే దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉండి కూడా చైనా ఉత్పత్తులను నిషేధించలేక పోతోందని విమర్శకులు చెబుతున్నారు. (పతంజలి ‘కరోలిన్’పై పెను దుమారం)
Comments
Please login to add a commentAdd a comment