ముండేను ఢీకొన్న కారుడ్రైవర్ అరెస్టు
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి గోపీనాథ్ ముండే మృతి కేసులో.. ఆయన కారును ఢీకొన్న టాటా ఇండికా కారు డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం తెల్లవారుజామున ముండే మారుతి ఎస్ఎక్స్ 4 కారులో ప్రయాణిస్తున్నారు. ఆయన ఢిల్లీ నుంచి ముంబై వెళ్లేందుకు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్నారు. అయితే, పృథ్వీరాజ్ రోడ్డు - తుగ్లక్ రోడ్డు జంక్షన్ వద్ద ఉన్న ఎర్ర సిగ్నల్ను దాటిన ఇండికా కారు వచ్చి, ముండే ప్రయాణిస్తున్న మారుతి కారును ఢీకొంది. దాంతో కారు వెనకసీట్లో ఉన్న ముండే.. కిందకు పడిపోయారు. అదేసమయంలో ఆయనకు తీవ్రంగా గుండెపోటు వచ్చింది.
ఎయిమ్స్కు తీసుకొచ్చేసరికే ముండేకు ఊపిరి అందట్లేదని, నాడి ఆడట్లేదని, గుండె కొట్టుకోవట్లేదని వైద్యులు తెలిపారు. కార్డియో పల్మనరీ రీససికేషన్ ప్రక్రియ చేసినా వైద్యులు ఆయనను కాపాడలేకపోయారు. దీంతో.. ఇండికా కారు డ్రైవర్ గుర్జీందర్ సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఇంపీరియల్ హోటల్లో పనిచేస్తుంటాడు. అతడిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.