బతికి ఉండటమే తప్పా? | Is it wrong to be alive? | Sakshi
Sakshi News home page

బతికి ఉండటమే తప్పా?

Published Wed, Jan 6 2016 5:52 AM | Last Updated on Sun, Sep 3 2017 3:08 PM

బతికి ఉండటమే తప్పా?

బతికి ఉండటమే తప్పా?

నేను పోలీస్‌నని తెలిశాక చంపటానికి తిరిగివచ్చారు: పంజాబ్ ఎస్‌పీ
 
 చండీగఢ్: పఠాన్‌కోట్ దాడికి దారి తీసిన లోపాల్లో.. అందకుముందు వారి చేతుల్లో కిడ్నాపై విడుదలైన గురుదాస్‌పూర్ ఎస్‌పీ సల్వీందర్‌సింగ్ కథనంలో పొంతన లేని అంశాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై ఆయనను దర్యాప్తు అధికారులు సోమవారం ఆరు గంటలు ప్రశ్నించారు కూడా. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ.. డిసెంబర్ 31వ తేదీ రాత్రి తాను డ్రైవరు, మరో సహాయకుడితో కలిసి సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక ఆలయానికి వెళ్లి వస్తుండగా ఉగ్రవాదులు తమను కిడ్నాప్ చేశారన్నారు. ‘నేను యూనిఫాంలో లేను. కానీ నా అధికారిక కారులో వెళ్లాను.

నన్ను కిడ్నాప్ చేసిన వారివద్ద ఏకే47 తుపాకులు ఉన్నాయి. పంజాబీ, హిందీ, ఉర్దూ మాట్లాడారు. నా కారును హైజాక్ చేశాక తర్వాత నా చేతులూ, కాళ్లూ కట్టేశారు.. నోటికి, కళ్లకు ప్లాస్టర్ వేసి మూసేశారు. నేను పోలీసు అధికారినని వారికి తెలియదు. నన్ను వదిలేసి వెళ్లారు. నా మూడు సెల్ ఫోన్లలో రెండు తీసుకున్నారు. నా గార్డు నా మొబైల్ ఫోన్‌కు కాల్ చేయగా, ఉగ్రవాదులు ‘సలామ్ అలేకుం’ అన్నారు. నా గన్‌మన్ ఫోన్ చేయటంతో నేను పోలీసు అధికారినని వారికి తెలిసింది. దీంతో వారు నన్ను చంపటానికి తిరిగి వచ్చారు.

ఎవరినైనా హెచ్చరించటానికి ప్రయత్నిస్తే అందుకు మూల్యం చెల్లించాల్సి వస్తుందని బెదిరించి వెళ్లిపోయారు. నేను తప్పించుకుని, ఓ  గ్రామానికి చేరుకుని, నా దగ్గరున్న మూడో సెల్‌ఫోన్‌తో శుక్రవారం తెల్లవారుజామున ఉన్నతాధికారులకు కాల్ చేసి సంప్రదించాను. నేను చెప్పిన దాంట్లో దాపరికం లేదు. నేను ఇంకా బతికి ఉండటమే నా తప్పా? నేను తప్పు చేస్తే నన్ను ఉరితీయండి’ అని అన్నారు.

 సమాచారం ఇవ్వటం వల్లే ..
 పఠాన్‌కోట్‌లో దాడికి ముందు ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి, కొట్టి వదిలేసిన గురుదాస్‌పూర్ పోలీస్ సూపరింటెండెంట్ ఇచ్చిన సమాచారాన్ని  వెంటనే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామని.. కాబట్టే ఉగ్రవాదుల దాడులకన్నా ముందుగానే ఎన్‌ఎస్‌జీ బలగాలు ఎయిర్‌బేస్‌కు చేరుకున్నాయని పంజాబ్ డీజీపీ సురేశ్‌అరోరా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement