అటు కూంబింగ్.. ఇటు విచారణ | Combing on Pathankot attack | Sakshi
Sakshi News home page

అటు కూంబింగ్.. ఇటు విచారణ

Published Thu, Jan 7 2016 2:01 AM | Last Updated on Sun, Sep 3 2017 3:12 PM

అటు కూంబింగ్.. ఇటు విచారణ

అటు కూంబింగ్.. ఇటు విచారణ

పఠాన్‌కోట్ రంగంలోకి ఎన్‌ఏఐ చీఫ్
♦ సాయంత్రం ఎయిర్‌బేస్ వద్ద కలకలం
♦ ఎస్పీ సల్విందర్ సింగ్‌ను ప్రశ్నించిన ఎన్‌ఏఐ
 
 పఠాన్‌కోట్: ముష్కర మూకలు దాడి చేసిన పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో కూబింగ్ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. నాలుగు రోజులుగా తుపాకుల మోతతో హోరెత్తిన ఈ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదులు మిగిలున్నారా అనే అనుమానంతో భద్రతా దళాలు అణువణువూ గాలిస్తున్నాయి. మరోవైపు ఈ ఘటనను విచారించేందుకు ఎన్‌ఐఏ చీఫ్ శరద్‌కుమార్ రంగంలోకి దిగారు బుధవారం ఎయిర్‌బేస్‌లో వాస్తవ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. పఠాన్‌కోట్ ఘటనకు సంబంధించి.. ఇప్పటివరకు మొత్తం మూడు కేసులను ఎన్‌ఐఏ నమోదు చేసింది.

జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి చెందిన 20 మంది సభ్యుల బృందం ఎయిర్‌బేస్‌లో ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమై ఉంది. మరోవైపు పఠాన్‌కోట్ ఘటనకు ముందు కిడ్నాపై విడుదలైన ఎస్పీ సల్విందర్ సింగ్‌నుకూడా ఎన్‌ఐఏ విచారించింది. ఎస్పీ, గాయాలతో ఉన్న అతని మిత్రుడు వర్మ చెబుతున్న విషయాలకు పొంతన కుదరకపోవటంతో ఎన్‌ఐఏ అనుమానం వ్యక్తం చేసింది. గురుద్వారా పూజారిని కూడా ఎన్‌ఐఏ విచారించింది. కిడ్నాప్ విషయంలోనూ ఎస్పీ, డ్రైవర్, వర్మ చెబుతున్న దానికి పొంతన కుదరలేదు.

బుధవారం సాయంత్రం పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ వద్ద కలకలం రేగింది. గడ్డంతో, ఖాకీ దుస్తుల్లో వచ్చిన ఓ వ్యక్తి ఎయిర్‌బేస్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా గుర్తించిన బలగాలు.. అప్రమత్తమయ్యాయి. ‘బ్యాగును దూరంగా పడేసి.. నేలపై పడుకోవాల’ని ఆర్మీ చేసిన హెచ్చరికలను ఆ వ్యక్తి పట్టించుకోలేదు. 15-20 నిమిషాల హైడ్రామా తర్వాత భద్రతా బలగాలు ఆయన్ను పట్టుకున్నాయి. కాగా, ఆర్మీ, ఎన్‌ఎస్‌జీ సంయుక్తంగా పఠాన్‌కోట్ ఆపరేషన్‌ను నిర్వహించాయని.. లెఫ్టినెంట్ జనరల్ కమల్‌జిత్ సింగ్ తెలిపారు.

ఉగ్రవాదులు ఎయిర్‌ఫోర్సు స్టేషన్ లోపల ఉన్న రెండస్తుల భవంతిలో దాక్కోవటం వల్ల ఆపరేషన్ తొందరగా ముగిసిందన్నారు. కాగా, బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ పఠాన్‌కోట్ ఉదంతాన్ని కేబినెట్ సహచరులకు వివరించారు. మరోవైపు, సరిహద్దుల్లో భద్రతా లోపాల కారణంగానే ఉగ్రవాదులు భారత్‌లోకి వచ్చారన్న విమర్శలతో భద్రత కట్టుదిట్టం చేశారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో పంజాబ్, కశ్మీర్ సరిహద్దుల్లో గస్తీ కాసేందుకు 2వేల మంది జవాన్లను పంపించారు. అటు దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అంచెలవారిగా సీఐఎస్‌ఎఫ్, క్విక్ రియాక్షన్ టీమ్ సభ్యులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

 ఇది భద్రతా వైఫల్యమే: కాంగ్రెస్
 పఠాన్‌కోట్ దాడి కచ్చితంగా భద్రతా వైఫల్యమేనని, బాధ్యులు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత సుశీల్‌కుమార్ షిండే అన్నారు.  శాంతి చర్చలకు విఘాతం కలిగించేందుకే ఉగ్రవాదులు దాడికి తెగబడినా.. దానిని లెక్కచేయకుండా ఇరు దేశాలు ముందుకెళ్లడాన్ని హురియత్ కాన్ఫరెన్స్ స్వాగతించింది.

 నిరంజన్ కుటుంబానికి రూ. 50 లక్షలు
 పఠాన్‌కోట్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఎన్‌ఎస్‌జీ కమాండో లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కుటుంబానికి కేరళ ప్రభుత్వం రూ. 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement